Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

హుష్...! ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు...!!

(ఉద్యోగులు న్యూస్)

ఎదురు చూసీ చూసీ....ఊరించి ఊరించి...నాయకుల మాటలు వినీ వినీ...చివరకు విడుదలైన సుదీర్ఘ డీఏ షెడ్యూలు చేసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది.  ప్రభుత్వ ప్రకటన విడుదలైన తర్వాత శనివారం రాత్రి ఒక్కసారిగా ఊసూరుమన్నారు. ఆ తర్వాత చేతిలో ఉన్న ఫోన్లు తీసుకుని  తమ వాట్సాప్ గ్రూపుల్లో , సామాజిక మాధ్యమాల్లో  ఈ అంశంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగు చేశారు.. తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.  ఉద్యోగ సంఘ నాయకులనూ టార్గెట్ చేశారు.

‘‘ ఇచ్చారా?

ఇస్తున్నారా?

ఇవ్వాలనుకుంటున్నారా??"

.... అని ఒక ఉద్యోగి డీఏలకు సంబంధించి పోస్టు చేసిన కామెంట్ పరిస్థితి  తీవ్రతకు అద్దం పడుతుంది.  నిజంగానే డీఏలు ప్రకటించారో లేదో అర్థం కాని పరిస్థతి ఉందని ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 2019 జులై నుంచి పెండింగులో ఉన్న డీఏ అందుకోవాలంటే 2022 జనవరి వరకు వేచి ఉండేలా షెడ్యూలు వెలువరించడంతో ఉద్యోగులు షాక్  తిన్నారు. అంటే ఇప్పటికే ఏడాదికి పైగా వేచి చూస్తుంటే ఆ డీఏ అందుకోవడానికి దాదాపు మొత్తం మీద రెండున్నరేళ్లు  ఆగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ షెడ్యూలు ప్రకారం వచ్చే జనవరి నుంచి ఆరు నెలలకు ఒక డీఏ ప్రభుత్వం ప్రకటించినట్లయింది. అంటే ఇక పాత డీఏలు మరిచిపోయి కొత్త డీఏలు ఆరు నెలలకు ఒకటి చొప్పున ప్రకటిస్తున్నట్లుగా లేదూ అని  మరో ఉద్యోగి సందేహం వ్యక్తం చేశారు. రాష్ర్ట  స్థాయిలో  పేరున్న ఒక ఉద్యోగ సంఘ నాయకుడు తొలుత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో సోషల్ మీడియాలో ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని ఉతికి ఆరేస్తుండటంతో ఆయన తన ధన్యవాదాలు వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంటే పరిస్థితి తీవ్రతకు ఇది అద్దం పట్టడం లేదూ....

 నవంబరు నుంచి ఒక డీఏ ప్రకటించి, పెండింగు జీతాలు ఇచ్చి ఉన్నా ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదని త్వరలోనే మరో రెండు డీఏలు వస్తాయని ఎదురుచూస్తుండే వారమని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. కనీసం ఎదురుచూపులు అన్న ఆశ కూడా లేకుండా 2021 సంక్రాంతి వరకు వాయిదా వేయడం, పైగా 2022 జనవరి వరకు పొడిగించడంతోనే ఆగ్రహ స్థాయి పెరిగిందని కొందరు విశ్లేషిస్తున్నారు.

 ప్రభుత్వ పెద్దలు కొందరు నవంబరు నుంచి డీఏ ఇచ్చేందుకు వీలుగా  నిర్ణయాన్ని కొలిక్కి తీసుకువచ్చారని, మరో  డీఏ కూడా సమీపంలోనే ఇచ్చేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సిద్ధమయ్యారని సమాచారం.  సమీపంలోనే  రెండు డీఏల ప్రకటనకు అంతా ఖాయమనుకున్న సమయంలోఆర్థికశాఖ అధికారులు మొత్తం మార్చి వేశారని చెబుతున్నారు.