Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

టీచరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలు ప్రవేశించేనా?

   (ఉద్యోగులు న్యూస్)

టీచర్ల ఎమ్మెల్సీ  ఎన్నికల హంగామా  ఓటర్ల నమోదు ప్రక్రియతో ప్రారంభమైంది. నవంబరు 8 వరకు ఓటర్ల నమోదు చేసుకునే వీలుండటంతో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు ఫారం లు తీసుకువెళ్లి నమోదు చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు- ఉభయగోదావరి జిల్లాల  టీచరు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో  ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే అభ్యర్థులు ఎవరెవరు, ఎవరి తరపున ఎవరు రంగంలోకి దిగుతారనే చర్చ ప్రారంభమయింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, కొందరు ఆసక్తిగల వారు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు.  కొందరి బలమైన వారి మద్దతు సంపాదించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  రాము సూర్యారావు, ఏ.ఎస్. రామకృష్ణల పదవీకాలం పూర్తి కావడంతో ఈ  ఎన్నిక అనివార్యమయింది. కిందటి సారి ఎన్నికల్లో నాటి అధికార పార్టీ మద్దతుతోనే కృష్ణా-గుంటూరు జిల్లాల టీచరు ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైకాపా మద్దతు సంపాదించుకుని రెండు నియోజకవర్గాల్లోను ఎమ్మెల్సీ స్థానానికి బరిలో నిలవాలని ఇప్పటికే కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు.  ప్రధానంగా  ఉభయగోదావరి జిల్లాల్లో గతంలో  ప్రజాప్రతినిధులుగా ఉన్న ఇద్దరు బడా వ్యక్తులు అధికార వైకాపా మద్దతుతో బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తెదేపాలో  ఉన్న ఆ అభ్యర్థి కూడా ప్రస్తుతం వైకాపా తరపున  బరిలో నిలిచేందుకు  ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో విద్యాసంస్థ అధినేత కూడా అవే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

ఇక  కృష్ణా గుంటూరు నియోజకవర్గాల కు సంబంధించి వైకాపా మద్దతు కోసం  ఇద్దరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నేత  సహకారం తీసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. వీరిద్దరిలో ఒకరిని అధిష్ఠానం మద్దతుతో బరిలో నిలిపి మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేయించాలనే ప్రయత్నాలు  సాగుతున్నాయి.

ఇక తెలుగుదేశం మద్దతుతో ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ రామకృష్ణ మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే  ఈసారి టీచరు ఎమ్మెల్సీ స్థానానికి కూడా అమరావతి పరిరక్షణ సమితి తరపున బరిలో నిలిపి వివిధ  పక్షాల మద్దతుతో పోటీకి నిలిపే అవకాశం ఉందని, ఇందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.  అదే జరిగితే తెదేపా మద్దతు కూడా అటు దక్కే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి ఉభయగోదావరి జిల్లాల టీచరు ఎమ్మెల్సీ స్థానం వ్యవహారమూ ఆధారపడి ఉంటుంది.

కొసమెరుపు- ఒక వైపు టీచరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రయత్నాలు సాగుతున్నా  ఇప్పటికే శాసనమండలి రద్దు తీర్మానం చేసి ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇందుకోసం  ఇటీవలే ఒక రాష్ర్ట మంత్రి కేంద్ర న్యాయ వ్యవహారాలశాఖ మంత్రిని కలిపి మండలి రద్దు కు పార్లమెంటు ఆమోదానికి సహకరించాలని కోరి వచ్చారు. మార్చి నాటికి పరిస్థితులను బట్టి  దిల్లీ తదంనతర  పరిణామాలు ఏమైనా ఉంటాయా అన్నది వేచి చూడాలి.