26న సార్వత్రిక సమ్మెకు యూటీఎఫ్ మద్దతు

*షేక్ సాబ్జి, బాబురెడ్డి వెల్లడి

(ఉద్యోగులు న్యూస్) 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన అఖిల భారత సమ్మెకు యూటీఎఫ్ మద్దతు తెలియజేస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ,ప్రధానకార్యదర్శులు షేక్ సాబ్జీ, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ప్రజాస్వామిక  హక్కులపై దాడి చేస్తోందన్నారు. పార్లమెంట్ లో చర్చలేకుండానే నూతన విద్యా విధానం  ఆమోదించిందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు భారీస్థాయిలో ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. రూ. లక్షలాది కోట్ల ఆస్తులతో దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ఎల్ఐసిని ఫ్రైవేటీకరిస్తోందదని, బ్యాంకులు, రైల్వేలు, బీఎస్ఎన్ఎల్, విమానాశ్రయాలు  ఇలా దేన్నీ వదలకుండా ప్రయివేటీకరణ చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 2021 వరకు డీఏలు నిలిపివేసిందని, సీపీఎస్ రద్దు చేసేది లేదంటోందని, బలవంతవపు పదవీ విరమణకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో కూడా డిఏలు నిలుపుదల చేశారని,  పీఆర్సీ, సీపీఎస్ పై కాలయాపన చేస్తున్నారని సాబ్జి, బాబరెడ్డిలు విమర్శించారు. 
ఈ అన్ని విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 26న జరిగే అఖిల భారత సమ్మెకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అన్ని జిల్లా, డివిజన్ కేంద్రాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు