డిసెంబర్ 15 నాటికి   మొదటి విడత పెండింగు జీతం

*    జనవరి 15  కి రెండో విడత
*    చెల్లింపులు పూర్తి చేయాలి
*     వడ్డీ పై ఇరు పక్షాల వాదనలకు ఆహ్వానం
*    అప్పటి వరకు వడ్డీపై స్టే
*    సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశం ఇదీ

(ఉద్యోగులు న్యూస్) 


కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగులో ఉంచిన జీతాల  చెల్లింపులకు సుప్రీంకోర్టు స్పష్టమైన గడువు విధించింది.  పెండింగులో ఉంచిన మొత్తాన్ని రెండు సమాన విడతలుగా విడగొట్టి తొలి విడత చెల్లింపులు 2020 డిసెంబర్ 15 లు చెల్లించాలి ఆదేశించింది. రెండ విడత  మొత్తాన్ని  2021 జనవరి 15 లోపు చెల్లించాలి  ఆదేశించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి విడుదలయింది. అందులో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వాదోప వాదాలు, సమగ్ర నిర్ణయమూ ఉంది.  మళ్లీ కేసు విచారించే వరకు 12శాతం వడ్డీ చెల్లింపులపై స్టే విధించింది.
హైకోర్టు 12శాతం వడ్డీతో పెండింగు జీతాలు ఇవ్వాలన్న ఆదేశాలపై రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో  స్పెషల్ లీవు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం వాదనలు జరిగిన విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, విశ్రాంత  సెషన్స్ జడ్జి లక్ష్మీ కామేశ్వరి మధ్య వివాదంలో రాష్ర్ట హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. జస్టిస్ డి వై చంద్రదూడ్, జస్టిస్  ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల త్రిసభ్య ధర్మాసనం ఈ  కేసును విచారించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.
 పెండింగు జీతాలు చెల్లించే విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు కావాలని ప్రభుత్వ తరపున న్యాయ వాదులు నివేదించారు. 2021 మార్చి నెలాఖరు లోపు పెండింగు జీతాలు అన్నీ చెల్లించేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందని సైతం వారు తెలిపారు. కరోనా కారణంగా ఏర్పడ్డ ఆర్థిక పరిస్థితులు చట్టబద్దంగా ఉన్న వెసులుబాట్లు తదితరాలు వారు వివరించారు. ఈ కేసులో ప్రతివాదుల తరపున న్యాయవాది  యలమంచిలి శివ సంతోష్ కుమార్ కేవియట్ దాఖలు చేశారు.  వివిధ అంశాలపై వాదనల తర్వాత  హైకోర్టు ఇచ్చిన 12శాతం వడ్డీ నుంచి మినహాయింపులను మాత్రమే పిటిషనర్ ( రాష్ర్ట ప్రభుత్వం) కోరుతున్నట్లగా పిటిషన్ సారాంశాన్ని తేల్చారు.  ధర్మాసనం  వాదనలు విన్న తర్వాత  నిర్ణయాలు వెలువరిస్తున్నట్లు పేర్కొంది.