కాంట్రాక్టు ఉద్యోగులకు పింఛన్ సహా ఆర్థిక ప్రయోజనాలు

*   ముఖ్యమంత్రి చెప్పా రన్న బండి శ్రీనివాసరావు
*    ఎన్ జీ వో సంఘం వెబ్ సైట్ ప్రారంభించిన సజ్జల
*   ఎవడబ్బ సొమ్మని మా సంఘం గుర్తింపు రద్దు చేయిస్తారు?
*   ఈ ప్రభుత్వం మేం తెచ్చుకున్నది
*   ఎన్ జీ వో సంఘం ప్రధాన కార్యదర్శి ఘాటు విమర్శలు..

  
(ఉద్యోగులు న్యూస్)

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ముఖ్యమంత్రి అనుకున్నారని, సుప్రీంకోర్టు నుంచి ఇబ్బందులు ఉన్నందున పింఛన్ తో సహా మొత్తం రెగ్యులర్ చేస్తే వచ్చే ప్రయోజనాలన్నీ ఇవ్వాలనుకుంటున్నారని ఎన్ జీ వో సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు చెప్పారు.  ఎన్ జీ వో సంఘం కొత్తగా రూపొందించిన వెబ్ సైట్ ను  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు.   విజయవాడలోని ఎన్ జీ వో సంఘం రాష్ర్ట ప్రధాన కార్యాలయంలో ఈ సభ జరుగుతోంది. సభలో సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

 అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు 27  శాతం ఐ ఆర్ ను సీఎం జగన్ ఇచ్చారు .  ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం జగన్ దే అని శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సనయనస్యలను వెంటనే పరిష్కరించేలా చేసిన ఘనత సజ్జల రామకృష్ణా రెడ్డికే దక్కతుందని ప్రశంసించారు.  కరోనా బారిన పడిన ఉద్యోగులకు నెల పాటు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని  కోరుతున్నామని చెబుతూ 
ఇందుకు  సీఎం సానుకూలత వ్యక్తం చేశారని,  అయితే దీనికి సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డు వస్తున్నాయని సీఎం తమకు చెప్పారన్నారు.  కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పింఛన్ సహా ఆర్థిక ప్రయోజనాలు వచ్చేలా చేద్దామని సీఎం వెల్లడించారని బండి శ్రీనివాసరావు సభలో వివరించారు.  ఉద్యోగులకు మూడు డీఏలు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరుతున్నామని సజ్జలకు విన్నవించారు.  ఉద్యోగులంతా నవ రత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్నారని చెప్పారు.  ప్రతి ఉద్యోగికి ఇళ్లు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు.  గత సీఎం అన్నీ తాత్కాలికం అని చెబుతూ పదవి కూడా తాత్కాలికంగా పోగొట్టుకున్నారని, ఉద్యోగులకు విశాఖ పట్నంలో ఇళ్లు ఇస్తామని సీఎం చెప్పడం సంతోషకరమని బండి శ్రీనివాసరావు చెప్పారు.  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులతో చెలగాటం ఆడుతోందన్నారు.  కరోనాతో ఇప్పటితే చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని,   ఇప్పట్లో ఎన్నికలు వద్దని ఎన్నికల సంఘానికి ఎన్జీవో సంఘం తరపున లేఖ రాస్తామని చెప్పారు.
మిగిలిన ఉద్యోగ సంఘాలకు కూడా గుర్తింపు ఇవ్వాలని తాము కోరుతోంటే, తమ సంఘం గుర్తింపు రద్దు చేయిస్తామని కొందరు అంటున్నారని బండి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని తాము తెచ్చకున్నామని ఎవడబ్బ సొమ్మని  తమ సంఘం గుర్తింపు రద్దు చేయిస్తారని బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు.