తితిదే ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు 300 ఎకరాలు
 

* ముఖ్యమంత్రి ఆదేశంతో చర్యలు
* రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల వెల్లడి

(ఉద్యోగులు న్యూస్)


తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా 300 ఎకరాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిలు బుధవారం ఆ ఉద్యోగులకు తెలియజేశారు.  తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ ఈ విషయం ఒక ప్రకటనలో తెలిపారు.  తితిదే ఉద్యోగ సంఘాల సమస్యలపై బుధవారం తితిదే చైర్మన్, జిల్లా మంత్రి, స్థానిక ఎమ్యెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వారు సానుకూలత వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇంటి స్థలాలు, నగదు రహిత వైద్యంపై జరిగిన చర్చలు సఫలమయ్యాయి. తితిదే ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం 300 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశంచారని, దానికి అనుకూలంగా జిల్లా కలెక్టర్  వడమాలపేట వద్ద 300 ఎకరాలు ఉన్నాయని  తెలియజేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రామచంద్రారెడ్డి, ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు ఈ చర్చల సందర్భంగా తెలిపారు. నగదు రహిత వైద్యం విషయంలోను ఉద్యోగులకు అనుకూలంగా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు  చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా చర్యలు తీసుకుంటున్న వారికి చీర్ల కిరణ్ ధన్యవాదాలు తెలిపారు.