Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఐఏఎస్ ల తీరు వల్లే కాంట్రాక్టు ఉద్యోగులకు ఇబ్బందులు

*  క్రమబద్ధీకరణ చేయకపోవడానికి వారే కారణం

*  కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు ఆర్థికశాఖ వద్ద లేవా

*  ఇదేం విడ్డూరం

*  యాప్ లతో వేధింపులు ఏమిటి

*  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార రావు

 

 

             (ఉద్యోగులు న్యూస్)

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నా కొందరు ఐఏఎస్ అధికారులే కావాలని ఆలస్యం చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు అన్నారు. ముఖ్యంగా కోవిడ్ ను వంకగా చూపి – మెజారిటీ ఐఏఎస్ అధికారులు సచివాలయానికి రావటమే మానేశారన్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొద్దిమంది ఐఏఎస్ లు, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యం గల స్థానాల్లో కొనసాగుతూ నేటి ప్రభుత్వాన్ని అస్తిరపర్చేలా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉద్యోగ సంఘాల్లో కలుగుతోందని, ఈ విషయమై గౌరవ ముఖ్యమంత్రి దృష్టిసారించి ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారని ఆశతో కాంట్రాక్ట్, పారామెడికల్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల చూపించిన వాత్సల్యాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు కార్మిక ఉద్యోగుల సమావేశం  రాజమండ్రిలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆస్కారరావు మాట్లాడుతూ  ఒకపక్క ప్రమాదకరమైన కోవిడ్ విధులు నిర్వహిస్తూనే కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు క్షేత్ర స్థాయి పురుష హెల్త్ అసిస్టెంట్ , ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్,  స్టాఫ్ నర్స్ వంటి కేడర్ల ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తం గా ఉన్న అధికార పార్టీ నాయక గణాన్ని కలిసి అనేక విజ్ఞప్తులు చేశారన్నారు. విమానాశ్రయాల్లో సైతం పడిగాపులు పడి అధికార్లకు , రాజకీయ నాయకులకు , మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారన్నారు. మౌన దీక్షలు , జగనన్నహామీల అమలు దీక్షలు చేశారన్బారు. ప్రభుత్వం  కాలయాపన చేయకుండా తక్షణమే వైద్య ఆరోగ్య శాఖతో సహా అన్ని శాఖల్లో జిల్లా సెలెక్షన్ కమిటీల ద్వారా శాంక్షన్డు పోస్టుల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలనీ  డిమాండ్ చేశారు. లేదంటే తమ సంఘమే వారి తరపున పోరాడాల్సి వస్తుందన్నారు.

రెండు నెలలకోసారి కొనసాగింపు ఉత్తర్వులు ఏమిటి?

కాంట్రాక్ట్ ఉద్యోగులకు  ఈ ప్రభుత్వంలో నెలా రెండు నెలలకోసారి  కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల జీతాలు సకాలంలో పొందలేక , కొనసాగింపు ఉత్తర్వుల  నెపంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. 18 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల జాబితా ఆర్ధిక శాఖ అధికారుల వద్ద నేటికీ లేదని , వాటివివరాలు పంపాలని ఆయా శాఖలను తరచు కోరడం విడ్డురంగా ఉందన్నారు.  ఇది ఆయా శాఖల అధికారుల , ఆర్ధికశాఖ అధికారుల బాధ్యతా రహిత్యమేనన్నారు.

గ్రామ , వార్డు సచివాలయాల్లో కొద్ది గంటల్లోనే పలు సేవలు అందజేస్తున్నట్లు చెప్పుకొంటున్న అధికార్లు..మరి రాష్ట్ర స్థాయి సచివాలయం అమరావతిలో మాత్రం నెలలు , సంవత్సరాల తరబడి సమస్యలు పెండింగ్ లో ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. తమ సంఘం కాంట్రాక్ట్ ఉద్యోగుల రేగ్యులరైజేషన్ చేయాలన్న ప్రదాన డిమాండుతో సహా  25 డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి  జనవరి 7న స్వయంగా రాష్ట్ర సచివాలయంలో సమర్పించిందని గుర్తుకు తెచ్చారు. వెంటనే సాధారణ పరిపాలనా శాఖ (జిఎడీ ) సెక్రటరీ శశి భూషణ్ కుమార్  నుండి సంబంధిత శాఖ లకు పరిష్కారం నిమిత్తం పంపుతూ ఒక నెలలోగా ఏమి చర్యలు తీసుకున్నారో తెలపాలని యూఓ నోట్ ను సైతం ఫిబ్రవరి 2 వ తేదీన పంపారని ఆ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు. మంత్రుల కమిటీ, ఐఏఎస్ ల కమిటీ గడువు తీరినా ఇప్పటికీ వారు నివేదిక సమర్పించలేదని అన్నారు.

విభాగాధిపతులే కారణం...

 తమ సర్వీసులు రేగ్యులర్ కావేమో అన్న బెంగతో వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే వందలాది ఉద్యోగులు మరణించారన్నారు.  మరో ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా తన అభ్యర్ధనమేరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కొరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వివరాలు పంపాలని వైద్య ఆరోగ్య విభాగానికి ఆదేశాలు జారీ అయినా నేటికీ చర్యలు శూన్యం అని ఆయన చెప్పారు.  వైద్య ఆరోగ్య శాఖలో మరో ప్రధాన సమస్యగా ఉన్న జి వో 27 సవరణ విషయమై స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుండి హెచ్ వో డీ లకు వివరాలు పంపాలని   జారీ  అయిన ఉత్తర్వులకు నేటికీ చర్యలు లేకపోవడానికి  శాఖాదిపతులే కారణమన్నారు. వారివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని  ఆస్కారరావు అన్నారు.

ఎవరి మాట వినాలి?

1993 నవంబరు 25  ముందు నియమితులైన చాలా మంది నేటికిని క్రమద్ధికరణకు నోచుకోక పోవడం , కనీసం మినిమం టైం స్కేల్ కుడా అనుమతించకపోగా . కోర్టు వాజ్యాల్లో  కూడా ఉద్యోగులకు అనుకూలం గా వచ్చిన తీర్పులు అమలు పరచడం లో విపరీత జాప్యం  జరుగుతోందన్నారు.  గ్రామ , వార్డు సచివలయాలో పనిచేసే ఉద్యోగులు తమ మాతృ శాఖకు చెందిన అధికారులు మాట వినాలా , లేదా సచివాలయ అధికార్లు జారీచేసే ఉత్తర్వులు , ఆదేశాలు పాటించాలా అన్న అయోమయం లో నేటికినీ నలిగి పోతున్నారన్నారు . ముఖ్యం గా హెల్త్ సెక్రటరి ,ఏఎన్ఎం ల విషయం లో - వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అదేశాలే పాటించాలని వివరణ ఇస్తూ జి వో 113 ను జారీ చేసినా , అధికారులలో ఇంకా గందరగోళం నెలకొందన్నారు .

ఇదేం తీరు?

కుటుంబ సంక్షేమ కమిషనర్ కష్టతరమైన  ప్రోఫార్మాలు, ఆన్లైన్ అప్ లోడింగులు, గంటకొక ఈ మెయిల్‌ రిపోర్టింగ్ వంటి అనేక కార్యక్రమాలను అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేని  క్షేత్ర స్థాయి ఏఎన్ఎంలు , ఆశాలు, పర్యవేక్షకులను దాదాపు 14 రకాల ఆధునిక యాప్ లలో సమాచారాన్ని నిక్షిప్తం చేయమని ఇబ్బంది పెడుతున్నారన్నారు. దీని వల్ల వైద్య సేవలు అందబోవన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లలో , రివ్యు మీటింగుల్లో సిబ్బంది పనిచేయట్లేదని విమర్శిస్తున్న అధికారులు వారి పంధాను మార్చుకోవాలన్నారు . ఈ విషయాలన్నీ  ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం లో గురువారం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు వివరించడం జరిగిందన్నారు. ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర  కార్యదర్శి డి .శ్రీకాంత్ రాజు , జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ,కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘ నాయకులు ప్రసాద్,  రాంబాబు, అబ్బులు, ఆలీషా, ప్రభాకర్, దేవకోన, నిర్మల  తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి