మర మనుషులను కాదు.. మానవ వనరులను వృద్ధి చేయండి
* ఉపాధ్యాయులకు మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సూచన
*హక్కులు తో పాటు బడిని నిలబెట్టే బాధ్యత గురువుదే : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
* రైతుల పోరాటానికి టీచర్లు అండగా ఉందాం : ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు
*టీఎస్ యుటిఎఫ్ నాలుగో మహాసభలు ప్రారంభం
ఉపాధ్యాయులు విద్యార్థులనుమర మనుషులుగా కాకుండా దేశానికి విలువైన మానవ వనరులుగా తీర్చి దిద్దాలని టీఎస్ యుటిఎఫ్ ప్రతినిధుల సభ స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం పోరాటాలతో పాటు పాఠశాలలను సమాజ నిర్మిత కేంద్రాలుగా నిలపాలని కోరింది. రైతు ప్రతి ప్రయత్నానికి మద్దతివ్వాలని వారి పోరాటానికి అండగా నిలవాలని పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలులో భాగంగా ప్రతినిధుల సభ శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్సాహభరిత వాతావరణంలో ఈ సభలు ప్రారంభమయ్యాయి.విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి , ఐ వెంకటేశ్వరరావులు ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు ఎన్ సంయుక్త, టీఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఎస్ కె దత్ ఆయా సంఘాల పతాకాలను ఎగురవేశారు. ఉపాధ్యాయ అమరవీరులకు జోహార్లు అర్పించారు. యుటిఎఫ్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు మిన్నంటాయి. ప్రారంభ సభలో విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ తరగతి గదులను సమాజంతో సమన్వయపరిచి నిర్వహిస్తేనే ప్రతి విద్యార్థి క్రియాశీలకంగా ఎదుగుతాడని అన్నారు.
అధ్యయన అధ్యాపన సామాజిక స్పృహ అనే మూడు అంశాల ప్రాతిపదికన ఉపాధ్యాయులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ మోదీ సర్కార్ నూతన విద్యా విధానం తో కార్పొరేట్ సంస్థలకే మీరు చేసే ప్రయత్నం చేసింది అన్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ సర్కార్ మూడు నల్ల చట్టాలను రైతులపై ప్రయోగించిన అన్నారు. వాటిని రద్దు చేసేందుకు అన్నదాతలు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. నెల రోజుల పైగా సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న అన్నదాతల పోరాటపటిమ సమాజానికి సంబంధించిన అంశం అన్నారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సోమశేఖర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తన నివేదికను అందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గ భవాని మహిళా ఉద్యమ నివేదికను , వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ప్రధాన సంపాదకులు , కోశాధికారి నివేదికలను మహాసభల్లో ప్రవేశపెట్టారు ఈ నివేదికపై వివిధ జిల్లాల ప్రతినిధులు చర్చించారు.