స్థానిక  సంస్థల ఎన్నికలపై  ఇంప్లీడ్ పిటిషన్

  (ఉద్యోగులు న్యూస్ )

  ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై  ఇంప్లీడ్ పిటిషన్ను లంచ్ మోషన్ లో దాఖలు చేసింది. దీనిపై మధ్యాహ్నం 2.30లకు హియరింగ్ ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులు గత తొమ్మిది నెలలుగా కరోనా నియంత్రణ కోసం అలుపు లేకుండా కష్టపడుతున్నారన్నారు. ఈ ప్రక్రియలో వందల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని  వేలాది మంది కరోనా బారిన పడ్డారన్నారు. అయినా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు కరోనా పై పోరాడుతున్న విషయయాన్ని గ్రహించాలన్నారు.   వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 16 నుంచి మొదలవుతుందని ఉద్యోగులకు   వ్యాక్సి నేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం పడుతుందన్నారు.  అంతవరకు ఎన్నికలు వాయిదా వేయాలని ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గ్రామ పంచాయతీ పాలక మండలి  కాల పరిమితి ఆగస్టు, 2018 లో ముగిసిందన్నారు. కాలపరిమితి లోపల ఎన్నికలు పెట్టడంలో గానీ, రాజ్యాంగ బద్ధ విధి నిర్వహణలో ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నడూ చిత్తశుద్ధి చూపలేదన్నారు. 2018అక్టోబర్ 23న మూడు నెలల లోపు ఎన్నికలు నిర్వహించండని గౌరవ హైకోర్టు రిట్  32346/2018 లో ఉత్తర్వులు ఇచ్చిందని, అపుడు ఇదే ఎన్నికల కమీషన్ కోర్టు ఉత్తర్వులు అమలు  చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిచిందన్నారు. ఇపుడు కరోనా వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారు కనీసం ఉద్యోగులకు  వ్యాక్సిన్ ఇచ్చేవరకు 2 నెలల వాయిదా వేయమని కోరుతున్న వినకుండా ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.  కమిషన్ నిష్పక్షపాత వైఖరిపై అనుమానాలు రేకెత్తిస్తోందని   కమిషన్ నోటిఫికేషన్ లో కూడా అనవసర విషయాలు ప్రస్తావించారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎవరో ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.