భూముల రీసర్వే లో రెవెన్యూ ఉద్యోగులు సూచనలు పాటిస్తాం
* ముఖ్యమంత్రి జగన్ హామీ
* రెవెన్యూ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
ఉద్యోగులు న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో భూముల రీ సర్వే కార్యక్రమంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రాలు పరిశీలించిన సీఎం ఆయన కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కి ఈ మేరకు సూచనలు ఇచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డైరీ ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ ప్రభుత్వం భూముల సర్వే చేపట్టడం గొప్ప విషయమని, చారిత్రాత్మక మని కొనియాడారు. వందేళ్ల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం సాహసోపేతమైన చర్య అని పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని చెప్పారు. అధికారులకు తగిన స్థాయిలో శిక్షణ అవసరమని, రీ సర్వే కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయాలని బొప్పరాజు ముఖ్యమంత్రిని కోరారు. రెండు మండలాలకు కలిపి ఒక యూనిట్, 10 మండలాలకు డివిజన్ స్థాయిలో ఒక యూనిట్, జిల్లా స్థాయిలో సమన్వయం చేసేలా మరో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తే సర్వే సులభంగా పూర్తవుతుందని అసోసియేషన్ సమర్పించిన వినతి పత్రం లో పేర్కొంది. ఇలా చేయడం వల్ల రెవిన్యూ లో రెగ్యులర్ విధులకు అంతరాయం కలగదని పేర్కొన్నారు. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం ధనుంజయ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ డైరీని తయారుచేయడంలో కీలకపాత్ర పోషించిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు వి గిరి కుమార్ రెడ్డిని, రాష్ట్ర కల్చరల్ సెక్రెటరీ నరసింహారావు ను ముఖ్యమంత్రి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణ మూర్తి, ఉపాధ్యక్షులు.ఎన్ శ్రీనివాస్, ఎం విజయసింహరెడ్డి, బి. సుశీల తదితరులు పాల్గొన్నారు.