పెండింగు జీతంపై వడ్డీ ఇస్తారా?


*  సుప్రీంకోర్టు తేల్చేది జనవరిలో
*  పూర్తి వివరాలతో ప్రభుత్వ అఫిడవిట్ కు ఆదేశం
*   కౌంటర్ అఫిడవిట్ కు మరో 2 వారాలు
*    జనవరి మూడో వారంలో విచారణ

( ఉద్యోగులు న్యూస్)


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి, ఏప్రిల్ నెల పెండింగు జీతాలు, పెన్షనర్ల మార్చి నెల పెండింగు పెన్షన్ పై వడ్డీ అంశం పై ప్రస్తుతం సుప్రీంకోర్టే తాత్కాలికంగా స్టే విధించింది.  ఈ అంశంపై జనవరి మూడో వారంలో విచారణ జరిపి వడ్డీ చెల్లించాలా వద్దా? అన్నది తేలుస్తామని పేర్కొంది. పెండింగు జీతాలపై సుప్రీంకోర్టు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రతిలో ఈ విషయం ఉంది.
‘ 2 వారాల్లోగా అఫిడవిట్...
 ప్రస్తుతం పెండింగు జీతాలు రెండు విడతలుగా డిసెంబర్ 15, జనవరి 15 లోపు ఇవ్వాలని  సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో ఈ  స్పెషల్ లీవు పిటిషన పై ప్రతివాదులు తమ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు అవకాశం ఇస్తున్నామని, దీనిపై నోటీసులు కూడా జారీ చేస్తున్నామని పేర్కొంది. వడ్డీ చెల్లింపులకు సంబందించిన ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుంది తదితర వివరాలతో అపిడవిట్ దాఖలు చేయాలని  పేర్కొంది. ఇందుకు ఈ నెల 18 నుంచి రెండు వారాల పాటు  ప్రభుత్వానికి గడువు ఇస్తున్నట్లు తెలియజేసింది. ఈ అపిడవిట్ దాఖలు చేసిన తర్వాత ప్రతివాదులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు  మరో రెండు వారాలు గడువు ఇస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం స్పష్టం  చేసింది. జనవరి మూడో వారానికి కేసు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.  వడ్డీ విషయంలో ప్రభుత్వమూ, ప్రతివాదుల వాదన పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సుప్రీం పేర్కొంది.