డిసెంబర్ లో దశలవారీ పోరాటానికి నిర్ణయం

జాక్టో, యూఎస్పీసీ స్టిరింగ్ కమిటీ

ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలా...

 

(ఉద్యోగులు న్యూస్)

 

ఉపాధ్యాయుల పదోన్నతులు, సాధారణ, అంతర్జిల్లా బదిలీలు వెంటనే చేపట్టాలని, అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుని పాఠశాలలు ప్రారంభించాలని జాక్టో, యుయస్పీసీ స్టీరింగ్ కమిటీల ఉమ్మడి సమావేశం డిమాండ్ చేసింది. విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిసెంబర్ నెలలో దశలవారీ పోరాటాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుయస్పీసీ) ల రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుల ఉమ్మడి సమావేశం శనివారం మధ్యాహ్నం  టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

గత ఆరేళ్ళుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు యాజమాన్యం వారీగా, పాత పది జిల్లాల ప్రాతిపదికన చేపడతామని గత నవంబరు లో విద్యామంత్రి ఇచ్చిన హామీ సంవత్సరం గడచినా అమలు కాకపోవటం శోచనీయమని పేర్కొంది. అప్గ్రేడ్ అయిన పండిట్, పిఈటి పోస్టులతో సహా 25 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో పాటు సబ్జెక్ట్ టీచర్ల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారని, పదోన్నతులు వెంటనే చేపట్టాలని సమావేశం కోరింది. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులతో సహా సాధారణ బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు నిర్వహించి ఆయా ఉపాధ్యాయుల్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో అన్ని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నప్పటికీ పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించక పోవటంవల్ల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు వెంటనే ప్రారంభించాలని సమావేశం కోరింది.

ఉపాధ్యాయులు లేకుండా ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరగలేదని, బలవంతంగా డ్యూటీలు వేసి ఎన్నికల విధులకు రాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సందర్భాలున్నాయి తప్ప  జిహెచ్చెంసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను దూరం పెట్టటంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇక నుండి ఏ ఎన్నికలలోనూ ఉపాధ్యాయులకు డ్యూటీలు వేయకుండా ఉంటే సంతోషిస్తామన్నారు. నవంబర్26 న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు, రైతుసంఘాలు నిర్వహించే గ్రామీణ భారత్ బంద్ కు జాక్టో, యుయస్పీసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సమావేశంలో జాక్టో, యుయస్పీసీ నాయకులు జి సదానందంగౌడ్, కె జంగయ్య, కె కృష్ణుడు, కె రమణ, ఎం రాధాకృష్ణ, టి లింగారెడ్డి, విఠల్, వై విజయకుమార్, పర్వతరెడ్డి, చావ రవి, మైస శ్రీనివాసులు, పట్లోళ్ళ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.