ఉపాధ్యాయుల విజయం
 

*   డెమో తర్వాత అభ్యంతరాలు ఉంటే మాన్యువల్ కౌన్సెలింగు
*    సర్వీసు పాయింట్లు 31 ఏళ్ల వరకు పెంపు
*   ఫ్యాప్టో నిరసన ఉపసంహరణ

(ఉద్యోగులు న్యూస్)


బదిలీలు, రేషనలైజేషన్ విషయంలో  పట్టుబట్టి ఉపాధ్యాయులు విజయం సాధించారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. పీటముడి పడే వేళ  ఏడుగురు ఎమ్మెల్సీలు రంగంలోకి దిగి పరిస్థితులను చక్క దిద్దారు. విద్యా మంత్రి జోక్యం చేసుకుని ఫ్యాప్టోను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించకపోతే  పరిస్థితులు చేజారనున్నాయనే విషయాన్ని వారు వివరించి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేశారు.
 వెలగపూడి  సచివాలయంలోని నాలుగో బ్లాకులో బుధవారం మధ్యాహ్నం నుంచి  సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఫ్యాప్టో డిమాండ్లపై అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు.  ఈ చర్చల్లో పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ చినవీరభద్రుడు, జాయింట్ డైరక్టర్ డి.దేవానంద్ రెడ్డి ప్రభుత్వం తరపున పాల్గొన్నారు.  ఫ్యాప్టో తరఫున  జి.వి.నారాయణరెడ్డి, కె నరహరి, షేక్ సాబ్జి, పి. బాబురెడ్డి, ఎం. రఘునాథరెడ్డి, సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు,  పి.పాండురంగ వరప్రసాద్, సి.హెచ్ శరత్ చంద్ర, జి.హృదయరాజు, వి.శ్రీనివాసరావు,  జి.శౌరీరాయులు, పి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
వీరి చర్చల్లో కుదిరిన అంగీకారం  మేరకు నిర్ణయాలు ఇలా ఉంటాయి.
1.    సెకండరీ గ్రేడ్ టీచర్లకు  కొత్త సాప్టేవేర్ పై డెమో ఇస్తారు. అధి ఫలప్రదం కాకపోతే  మాన్యువల్ కౌన్సెలింగు నిర్వహిస్తారు.
2.     స్టేషన్ పాయింట్లపై ఉన్న సీలింగు 11 ఏళ్ల వరకు పెంచేందుకు అంగీకారం.
3.     సర్వీసు పాయింట్లు 31 ఏళ్లకు ఇస్తారు. అంటే మొత్తం 15.5 పాయింట్లు ఇస్తారు.
4.    ఛైల్డ్ ఇన్ ఫోలో మీడియం మారిన విషయంలో ఆయా ప్రధానోపాధ్యాయులు  ప్రత్యేకించిఅప్పీలు ఇస్తే పరిష్కరిస్తారు.
5.     ఖాళీలను బ్లాక్ చేసే విషయంల ప్రతి మండలాన్ని సమీక్షించి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగని విధంగా చూస్తారు.
6.     ప్రధానోపాధ్యాయులకు అకడమిక్ సంవత్సరాలకు బదులుగా పూర్తి సంవత్సరాలను పరిగణనలోకి  తీసుకునేందుకు అంగీకరించారు.
7.     పదవీవిరమణకు 3 ఏళ్ల లోపు సర్వీసు ఉన్నవారికి బదిలీల మినహాయింపు విషయం ప్రభుత్వానికి నివేదించేందుకు అంగీకారం.
21న పికెటింగ్ ఉపసంహరణ
చర్చలు ఫలప్రదం అయిన నేపథ్యంలో ఈ నెల 21 డీఈవో కార్యాలయాల ఎదుట ఫ్యాప్టో  ఆధ్వర్యంలో జరపతలపెట్టిన పికెటింగ్ ను ఉపసంహరించుకున్నట్లు ఆ సమాఖ్య ప్రకటించింది.