జీవో 11,12 లను  సవరించి  జీవో15ను అమలు చేస్తాం

*  మంత్రి కేటీఆర్ హామీ 

*  రాష్ర్టీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు వెల్లడి

(ఉద్యోగులు న్యూస్)

రాష్ట్రంలోని భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల అప్ గ్రేడేషన్  కోసం ప్రత్యేకంగా ఇచ్చిన జీవో15 అమలుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) హామీ ఇచ్చారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు - తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు  జగదీష్,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శానమోని నర్సింహులు సోమవారం ప్రగతిభవన్ లో మర్యాదరపూర్వకంగా మంత్రిని కలిసిన సందర్భంలో ఈ హామీ లభించింది.  ఆర్ యు పి పి టి ఎస్ వార్షిక క్యాలెండర్ ను కే టీ ఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్ గ్రేడేషన్ జీవో  అమలు గురించి ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించగా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు జగదీష్, నర్సింహులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదని కూడా మంత్రి చెప్పారని అన్నారు. కోర్టు చెప్పినట్లు జీవోలో స్వల్ప మార్పులు చేసి అమలుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు.  ఈ సందర్భంగా జీవో 330 తో పదోన్నతులు పొందిన గ్రేడ్ -1 పండితుల పెన్షన్ రికవరీని కూడా పరిశీలించి ఆ రికవరీని ఆపాలని కోరగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకునేందుకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని  ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సంఘం గౌరవ సలహాదారు లచ్చయ్య, నాయకులు వెంకటేశ్వర్లు,హరికృష్ణ,నర్సింగరావు,ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.