ఏ రోజు ఎవరెవరితో భేటీ?
 

* ఏ సంఘాలకు ఆహ్వానం...?


(ఉద్యోగులు న్యూస్)


తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ఈ నెల 6, 7 తేదీల్లో  సమావేశానికి ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. వేతన సవరణ కమిషన్  తన నివేదికతో పాటు సమర్పించే సినాప్సిస్ (ముఖ్యాంశాల) ప్రతిని ఉద్యోగ సంఘాలకు అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.   మొత్తం నివేదిక ప్రతి అందించడం కన్నా అందులోని ముఖ్య నిర్ణయాలకు సంబంధించిన వివరాలు  ప్రధానాంశాలుగా ఉద్యోగ సంఘాలకు అందజేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సైతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తమకు పీ ఆర్ సీ నివేదికలోని వివరాలు అందిస్తే చర్చలకు తాము సిద్ధమై రావడానికి ఉంటుందని, వాటిపై తమ సంఘ సభ్యులతోను మాట్లాడుకుని, తమ అభిప్రాయాలతో సమావేశానికి వచ్చేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు. మొట్టమొదటి సారిగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి మాట్లాడారు.  ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, వివిధ కేటగిరీల ఉపాధ్యాయుల సమస్యలపై గత నెల రోజులుగా తెలంగాణ రాష్ర్టంలో ఉపాధ్యాయ లో కం ఉద్యమిస్తోంది. యుయస్సీసీ, జాక్టో ఆధ్వర్యంలో వేలాదిగా ఉపాధ్యాయులు ఉద్యమించారు. హైదరాబాద్ లో వారు మహాధర్నాకు ఉపక్రమించిన రోజునే  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆ సంఘాల ప్రతినిధులు కొందరు చావ రవి, జంగయ్య, సదానందగౌడ్ తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో మేష్ కుమార్ ను కలిసి మాట్లాడారు. 
ఉద్యోగ, ఉపాధ్యాయ లోకంతో సానుకూలంగా వ్యవహరించి వారితో కలిసి ముందడుగు వేయాలనుకుంటున్న ప్రభుత్వం అన్ని ముఖ్య సంఘాల ప్రతినిధులకు చర్చల్లో చోటు కల్పించాలని కోరుతున్నారు. ఏ రోజు ఏ సంఘాన్ని  చర్చలకు పిలవనున్నదీ  సోమవారానికి స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అందరి ప్రతినిధులతో ఒకేసారి చర్చిస్తారా ? లేక విడివిడిగా  చర్చలు ఉంటాయా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.