Thursday 24th June 2021

8 మంది వ్యవసాయాధికారులను కోల్పోయాం
 

- విధి నిర్వహణ, కోవిడ్ జాగ్రత్తలూ రెండు ముఖ్యమే

-  సిబ్బందికి వ్యాక్సిన్ పై సీఎంతో మాట్లాడతా

- వ్యవసాయాధికారి సిరి సంతాప సభలో మంత్రి కన్నబాబు

 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 7-  ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కారణంగా ఇంతవరకు  8 మంది వ్యవసాయాధికారులను కోల్పోవడం ఎంతో ఆవేదన కలిగిస్తోందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వ్యవసాయాధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయించాలని వ్యవసాయాధికారుల సంఘం కోరిందని, దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు.  తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండల వ్యవసాయాధికారి ఎ.సిరి ఈ మధ్య కోవిడ్  తో మరణించడంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కృషి భవన్ లో సోమవారం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడారు.  ఉద్యోగ జీవితం ప‌రంగా విధుల నిర్వహణ ఎంత ముఖ్యమో   వ్యక్తిగత  జీవితం ప‌రంగా ఉద్యోగులు త‌మ‌తో పాటు వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.  తొలుత సిరి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పని పట్ల ఎంతో అంకితభావం, రైతుల సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కరించే మనస్తత్వం ఉన్న సిరి మరణం బాధాకరమని కన్నబాబు అన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందేలా చూస్తామని అన్నారు. ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పని చేస్తూ వ్యవసాయాధికారులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి అన్నారు. విధి నిర్వహణలో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నందున తమను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించాలని వ్యవసాయాధికారులు మంత్రికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎన్. విజయ్ కుమార్, వ్యవసాయాధికారుల అసోసియేషన్  తూర్పుగోదావరి జిల్లా యూనిట్ అధ్యక్షులు డి.వి.కృష్ణ, కార్యదర్శి డి.అరుణ్, ఉపాధ్యక్షులు దుర్గ, వ్యవసాయశాఖ డీడీలు మాధవరావు, నాగాచారి, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.