పీఆర్సీపై మంత్రి మండలిలో చర్చ ?
 

* చివర్లో చర్చించే అవకాశం 

* ఎజెండా అంశాల్లో అది లేదు
 

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు. కామ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మంత్రి మండలి ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంగళవారం సమావేశం కాబోతోంది. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 11 వ పీఆర్సీ నివేదికపై ఇందులో చర్చ జరిగే అవకాశం ఉందా అన్న అంశం తెరపైకి వచ్చింది. ఇటీవలే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో ప్రస్తుత మంత్రివర్గంలో ఇది చర్చకు రావచ్చన్న అంచనాలు ఉన్నాయి.
ప్రభుత్వం మంత్రిమండలికి అధికారికంగా సిద్ధం చేసిన ఎజెండా అంశాల్లో ఈ అంశం లేదని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. చివర్లో టేబుల్ అంశంగా లేదా, ముఖ్యమంత్రి, లేదా ఇతరుల ప్రస్తావన వల్ల చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదని తెలిసింది.
పీఆర్సీ నివేదిక ఇంతవరకు వెలుగులోకి రాలేదు. ప్రభుత్వం ఇంకా బయటపెట్టలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని, వారు అధ్యయనం చేస్తున్నారని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. 
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీఆర్సీ అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. వచ్చే బడ్జెట్ లో పీ ఆర్సీ అమలు వల్ల అవసరమయ్యే నిధుల కేటాయింపు జరపాల్సి ఉంది. ఈ లోపు పీఆర్సీ ఫిట్ మెంట్ అన్నది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. దీంతో  ప్రస్తుత మంత్రి మండలి సమావేశంలో పీఆర్సీ అంశం టేబుల్ అంశంగా చేర్చే అవకాశమూ ఉంది. లేదా ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకువచ్చి చర్చించి సూచనలు ఇచ్చే అవకాశమూ ఉంది. మధ్యాహ్నానికి స్పష్టత వస్తుంది.

ఎక్కువ మందిచదివినవి