షేక్ సాబ్జీ, నారాయణరావు... మరో ఇద్దరు, ముగ్గురి మధ్యే పోటీ

(ఉద్యోగులు.న్యూస్) , (ఉద్యోగులు. కామ్)


ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో షేక్ సాబ్జీ , గంధం నారాయణరావు ప్రధాన పోటీదారులుగా నిలవనున్నారు. వీరితో పాటు తెదేపా మద్దతుతో పోటీలో నిలిచిన సుభాష్ చంద్రబోస్ తో పాటు ప్రభావమూ ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 11 మంది పోటీ పడుతున్నారు. ప్రచారం చేసే కొద్దీ మరో ఒకరు ఇద్దరి ప్రభావమూ పెరిగే ఆస్కారం ఉంది.ఉభయగోదావరి జిల్లాల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచి ప్రచారం ప్రారంభించారు. కొందరు అభ్యర్థుల పేర్లు ముందు నుంచి నలుగుతూనే ఉన్నాయి. యూటీఎఫ్ రాష్ర్ట అధ్యక్షులు షేక్ సాబ్జీ పేరు మొదట్లోనే ఆ సంఘం ప్రకటించి బరికి తెర తీసింది. రామచంద్రపురానికి చెందిన విద్యాసంస్థ అధినేత గంధం నారాయణరావు ఎన్నికల క్షేత్రంలోకి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వీరి మధ్య పోటీ ఉంటుంది. షేక్ సాబ్జీ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేతగా టీచర్లకు సుపరిచితులు, ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొన్న నేతగా, పశ్చిమగోదావరిలో ఒక విద్యాధికారి వైఖరిని దునుమాడిన ఉపాధ్యాయునిగా ఆ లోకానికి పరిచయం ఉంది. గోదావరి జిల్లాలో విస్తృత క్యాడర్ ఉన్న యూటీఎఫ్ కార్యకర్తల బలం షేక్ సాబ్జీకి కలిసొచ్చే అంశం. వారు సంస్థాగతంగా పక్కా ప్రచారం నిర్వహిస్తున్నారు.
గంధం నారాయణరావుకు అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖుడి మద్దతు ఉంది. ఆయనతో బంధుత్వమూ ఉండటంతో అధికార పార్టీ అభ్యర్థిగానే బరిలో నిలిపే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ పార్టీ అధికారికంగా ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించడంతో స్వతంత్రంగానే పోటీలోకి దిగారు. ఆ జిల్లాలో రాజకీయంగా ఆ నాయకుడికి ఉన్న పట్టు...వారి సామాజిక వర్గానికి రెండు జిల్లాల్లో ఉన్న బలానికి తోడు మరికొందరి బలం మూటగట్టుకుంటే గట్టి పోటీ ఇవ్వగలమని భావిస్తున్నారు. పీఆర్ టీయూ (కరుణా నిధిమూర్తి), పీఆర్టీయూ (శ్రీధర్ రెడ్డి) సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఈ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ మరో మారు బరిలో దిగారు. గతంలో యూటీఎఫ్ లో పని చేసిన బోస్ ఆనక తెలుగు దేశం మద్దతు సంఘంలో కలిశారు. 
వీరితో పాటు ఇళ్ల సత్యనారాయణ, గంటా నాగేశ్వరరావు (నవజీవన్ పాల్) తిర్రె రవి దేవ, డాక్టర్ ఎం బీ నాగేశ్వరరావు, పలివెల వీర్రాజు, బొడుగు సాయిబాబా, యడవల్లి రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ పి.వంశీకృష్ణరాజా లు ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.

ఎక్కువ మందిచదివినవి