సీఎంకు ఉద్యోగులపై కనికరం లేదు
 

- కుటుంబాలను వదలి మరీ కష్టపడుతున్నాం

- ఉద్యోగులు ఎంతో అసంతృప్తిగా ఉన్నారు

- ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు విమర్శలు

 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 29-  కుటుంబాలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు పని చేస్తున్నా ముఖ్యమంత్రికి వారిపై కనికరం లేకుండా పోయిందని   ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. తిరుపతిలో గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఉద్యోగస్తులకు జగన్ ఎన్నో హామీలిచ్చారని ఆయన అన్నారు. ఆ హామీలతో ఉద్యోగుల ఓట్లను వైసీపీ దోచుకుందని విమర్శించారు. చివరకు ఇప్పుడు జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని  ఆయన విమర్శించారు. కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ పార్టీ హయాంలో  కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అన్నారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.  ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీ ప్రభుత్వానికి వెంటనే తన నివేదిక సమర్పించాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.