డీఏ ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు
 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట రామి రెడ్డి వెల్లడి
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
జులై 29:  ముఖ్యమంత్రి జగన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య,  వీఆర్వోల సంఘం గురువారం ఘనంగా సత్కరించింది.  ఎన్నికల సందర్భంగా హామీ  ఇచ్చినట్లుగానే   వీఆర్వోలకు పదోన్నతి అవకాశాలు కల్పించారని కృతజ్ఞతలు తెలియజేసింది. జులై నుంచి ఇవ్వాల్సిన డీఏకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇంకా విడుదల చేయలేదని  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే  స్పందించి డీఏకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం  అధికారులను ఆదేశించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట రామి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే  హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దె భత్యం కొనసాగింపు జీవో కూడా   విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షల గురించి ఆందోళన చెందుతున్నారని, పరీక్ష విధానాన్ని, పరీక్షల సిలబస్ ను సులభతరం చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.  దీనిపై  గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట రామి రెడ్డి,  సెక్రటరీ జనరల్ ఆరవ పాల్, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం  అధ్యక్షుడు రవీంద్ర రాజు, సంఘ ప్రతినిధులు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, అనిల్ పాల్గొన్నారు.