పిఆర్సీ,  సి పి ఎస్ రద్దు పై  రేపు ప్రభుత్వ పెద్దల భేటీ

*సాయంత్రం ఏడు గంటలకు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
 

సెప్టెంబరు 6 -ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల కీలక అంశాలకు సంబంధించి మంగళవారం ప్రభుత్వ పెద్దలు సమావేశం కాబోతున్నారు. సాయంత్రం  ఏడు గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు  సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్  నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మొదటి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి   ఆర్థిక శాఖ అధికారులు వచ్చినా  సమాచారం సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని అడిగారు. దాంతో వారం రోజుల్లో మళ్లీ భేటీ కావాలని సి ఎస్ నిర్ణయించారు. ఇప్పుడు ఆ రెండో సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ప్రధానంగా పిఆర్సీ అమలు, సి పి ఎస్ రద్దు, ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ,  డిఏ ల  అమలు,  అన్న ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో దాదాపు కీలక అంశాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి  రావత్ తో పాటు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు  పాల్గొంటారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఆ అంశాలపై కొలిక్కి వచ్చిన తరువాత  వీటిని ఒక నివేదిక రూపంలో పొందుపరిచి  ముఖ్యమంత్రి వద్ద మళ్లీ భేటీ అవుతారని సమాచారం. ఆ తర్వాత ఎలా ముందుకు సాగాలో సీఎం నిర్ణయం ఆధారంగా ముందడుగు పడుతుంది.