కాంట్రాక్టు ఉద్యోగులకు   ప్రతికూల సంకేతాలు...!


*  కింకర్తవ్యం అంటూ సాలోచనలు

(ఉద్యోగులు  న్యూస్)


ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) కు సంబంధించి  ప్రభుత్వం నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.  ముఖ్యమంత్రి జగన్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, సర్వీసుల శాఖల ఉన్నతాధికారులతో ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై సమీక్షించారు. ఇప్పటికే  ఈ అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పడింది. వారికి అనుబంధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆద్వర్యంలో ఉన్నతాధికారుల కమిటీ కూడా ఏర్పాటయింది. వారి అధ్యయనం ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అంశం  తెరపైకి వచ్చింది.  న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందున రెగ్యులరైజేషన్ తో సమంగా ఆర్థిక  ప్రయోజనాలు కల్పించేందుకు విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను నిర్దేశించారు. ప్రభుత్వం సమాచార పౌ ర సంబంధాలశాఖ ద్వారా విడుదల చేసే సమావేశం సమీక్షకు సంబంధించి విడుదల చేసిన నోట్ లోను ఇదే అంశం పేర్కొన్నారు.  కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి కూలసంకేతాలుగా కాంట్రాక్టు ఉద్యోగులు భావిస్తున్నారు.  ఈ మధ్య కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులు తమ రెగ్యులరైజేషన్ కోసం  మళ్లీ ఆందోళన బాట పట్టడం ప్రారంభించారు. ఇడుపుల పాయకు వెళ్లి అక్కడ వైఎస్  సమాధి వద్ద వినతిపత్రం ఇచ్చి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రతి కూల సంకేతాలు రావడంతో తదుపరి కార్యాచరణపై  వారు సాలోచన సాగిస్తున్నారు.


నియామకమైన తీరు పైనే అభ్యంతరాలు...


ప్రధానంగా అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులు నియామకమైన తీరుపైనే వారిని రెగ్యులర్ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెబుతున్నారు.  పోస్టు లేకుండానే కొందరు నియమితులయ్యారనేది మరో అంశం.  మొత్తం కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎంత మందికి రెగ్యులరైజేషన్ కు న్యాయమపరమైన ఇబ్బందులు ఉండబోవు అనేది తేల్చి ఇబ్బందులు లేనంత మేరకు  రెగ్యేలరైజేషన్ చేయాలన్న ప్రతిపాదన కూడా కాంట్రాక్టు  ఉద్యోగుల సంఘాలు తెరపైకి తీసుకువస్తున్నాయి.
ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థలో కొందరు కాంట్రాక్టు ఉద్యోగులకు అదనపు పాయింట్లు ఇచ్చి వారికి సచివాలయ వ్యవస్థలోకి

తీసుకువెళ్లారు. ఆయా శాఖల వారీగా కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు ఎంపిక పరీక్షలు రాసి, ఉద్యోగ నియామకానికి విధానపరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరామని, తమకు రెగ్యులరైజేషన్ కు అవకాశం ఉందని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో తొలుత ఎన్ని పోస్టులకు న్యాయపరమైన చిక్కులు ఎదురు కావు, ఎన్ని పోస్టులకు అలాంటి అభ్యంతరాలు  ఉంటాయనేది తేలిస్తే తదనుగుణంగా  సానుకూల పరిష్కారాలకు అవకాశం ఉంటుందని  కాంట్రాక్టు ఉద్యోగులు కొందరు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులు సేకరించిన సమాచారం మేరకు సుమారు 25 వేల మందికి అటూ, ఇటూ గా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు.   ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విషయంలోను  ఆ శాఖ అ ధికారుల నుంచి అంత సానుకూ ల మాటలు రావడం లేదు.
మరికొంత  ఆలస్యం....
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తాజా నిర్ణయం మరింత కాలం గడిచేందుకు ఉపయోగపడేలా ఉందనే భావనా వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు  అయింది. మంత్రివర్గ ఉపసంఘమూ, అధికారుల కమిటీ ఏర్పడ్డా హామీ నెరవేర్చేందుకు వీలైన  మార్గసూచి సిద్ధం చేసిన దాఖలాలు లేవు.   ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల అంశానికి నిర్దుష్ట గడువు లోపు సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.