పెన్షన్లు అందక....

(ఉద్యోగులు న్యూస్) 

ఆంధ్రప్రదేశ్ లో  పెన్షన్లు అందక పెన్షనర్లు ఎదురుచూపులు చూస్తున్నారు. జనవరి రెండో తారీకు వచ్చినా రాష్ర్టంలో ప్రభుత్వ పెన్షనర్లు ఎవరికీ పింఛను సొమ్ములు జమ కాలేదు. పెన్షనర్ల  ఇన్ కంటాక్సు మినహాయింపు విషయంలో తలెత్తిన ఇబ్బందుల వల్లే ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. గత కొద్ది నెలలుగా అనేక సందర్భాల్లో పెన్షనర్లకు ఎవరికీ సకాలంలో పింఛన్లు అందిన దాఖలా లేదు. అనేక నెలల పాటు రెండేసి వారాలు కూడా పింఛను కోసం ఎదురుచూసిన సందర్భాలు ఉంటూ వచ్చాయి. కచ్చితంగా నెల మొదటి తారీకున పింఛను అందుకుంటామనే నమ్మకం కోల్పోయామని పింఛనర్లు చెబుతున్నారు. మరో వైపు డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాలు ఉద్యోగులదరికీ  జనవరి ఒకటినే జమ అయ్యాయి.
పెన్షనర్లు చాలా మందికి అందే మొత్తాలు తక్కువే. వారికి అవసరాలు ఎక్కువ. సరైన సమయానికి చేతికి సొమ్ములు అందకపోతే బయటి నుంచి సమీకరించుకోవడం అంత సులభం కాదు. ఉద్యోగులకు జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా మొదట పింఛనర్లకు పెన్షన్ చెల్లిస్తే మంచిదనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది . పైగా ప్రభుత్వం నుంచి పెన్షన్ ఎందుకు అందలేదో కూడా చాలా మందికి సమాచారం ఉండదు. వీరు బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. లేకపోతే పెన్షనర్ల సంఘం నాయకులకు తరచు ఫోన్లు చేసి సంప్రదిస్తుంటారు.  ప్రస్తుతం ఆదాయపు పన్ను మొత్తాలు మినహాయించే పని ఖజానా  కార్యాలయాల్లో యుద్ధ ప్రాతిపదికన  చేస్తున్నారని సమచారం. క్రమేణా కొద్ది మందికి ఇవాళ రేపు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఒకేసారి కాకుండా పెన్షనర్లకు కొద్ది మంది, కొద్ది మందికి చొప్పున జమ చేసుకుంటూ వస్తారని సమాచారం.

ఎక్కువ మందిచదివినవి