కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ తరహాలో ఆర్థిక ప్రయోజనాలు

 

​​​​​​* క్రమబద్ధీకరణతో సమానంగా

* విధివిధానాలు రూపొందించాలి

* ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు

 

 (ఉద్యోగులు న్యూస్)

 

కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ చేస్తే  ఎలాంటి ఆర్థిక, ఇతర ప్రయోజనాలు అందుతాయో అవన్నీ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.  ఆంధ్రప్రదేశ్ లోని కాంట్రాక్టు ఉద్యోగుల  రెగ్యులరైజేషన్ అంశంపై సీఎం గురువారం అధికారులతో సమీక్షించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉన్నందున తొలుత ఇలా ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసులు) కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, పురపాలక పరిపాలన శాఖ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు, వివిధ శాఖల అధికారులు  ఈ సమావేశానికి హాజరయ్యారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం  వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ వారికి సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. అయితే మన ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ అమలు చేశామని చెప్పారు. అదే విధంగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్ (ఎంటీఎస్‌) కూడా అమలు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు.