కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ఔట్ సోర్సింగు వారికి జీతాలు పెంచాలి

- ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 13-  ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఔట్ సోర్సింగు ఉద్యోగులకు జీతాలు పెంచాలని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్వు, సెక్రటరీ జనరల్ వై వి రావులు ఆదివారం డిమాండ్ చేశారు.  కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఎంతో మంది ఉద్యోగులు ఎదురు  చూస్తున్నారని అన్నారు. మరో వైపు సీపీఎస్ రద్దు కోసమూ లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని వారు పేర్కొన్నారు. 11వ పీఆర్సీ కోసం కూడా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చాలని బొప్పరాజు, వైవీరావులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను వివిధ సందర్భాల్లో   ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. తక్కువ జీతంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఒప్పంద  ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సి ఉందని స్పష్టం చేశారు. అదే సమయంలో పొరుగు సేవల ఉద్యోగుల సేవలూ ఎంతో ముఖ్యమైనవని,   వారి జీతాలు పెంచాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త పీఆర్సీ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోందని, దీన్ని సాధించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఏమీ చేయడం లేదనే విమర్శలూ వస్తున్నాయని వారు పేర్కొన్నారు.  ఏడాదిన్నర కాలంగా  ప్రభుత్వం ఆర్ధికంగా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఉద్యోగుల డిమాండ్ల సాధనలో అమరావతి జేఏసీ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేస్తున్నామని అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం ప్రకటిస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు.