Thursday 24th June 2021

వైద్యులకు స్టయిఫండ్ పెంపు 
2020 సెప్టెంబరు నుంచి అమలు

- కోవిడ్ విధుల్లో పాల్గొంటున్న వైద్య విద్యార్థులకూ పెంపు

- వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి

 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 5 - ఆంధ్రప్రదేశ్ లో రెసిడెంట్ వైద్యులకు పెంచిన వేతనాలు 2020  సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెసిడెంట్ వైద్యుల స్టయిఫండ్ రూ.45,000 నుంచి రూ.70 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న మూడో సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థులకు కూడా పెరిగిన స్టయిఫండ్ ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. పీజీ విద్యార్థులు ఏప్రిల్ 30 తరవాత విధుల్లోకి చేరారని, ఆనాటి నుంచి పెంచిన స్టయిఫండ్ అందిస్తామని తెలిపారు.పరీక్షల్లో పాల్గొన్నా జులై 31 వరకూ పెంచిన స్టయిఫండ్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. స్టయిఫండ్ పెంపు ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని మొదట భావించినా ముఖ్యమంత్రి సెప్టెంబరు నుంచి పెంపును అమలు చేయాలని నిర్ణయించారన్నారు. కరోనాతో కారంచేడు పీహెచ్సీ వైద్యులు డాక్డర్ ఎన్ భాస్కరరరావు తీవ్ర అస్వస్థతకు గురై, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారన్నారు. డాక్టర్ భాస్కరరావుకు మెరుగైన వైద్యమందించడానికి రూ.1.50 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  మంజూరు చేశారని చెప్పారు. ఇటువంటి కేసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.