రెండు ఉద్యోగ జేఏసీలు కలసి...
       కదనరంగంలోకి...

 - బొప్పరాజు, బండి శ్రీనివాసరావుల భేటీ
 - త్వరలోనే ఉద్యమ కార్యాచరణ

  (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
 అక్టోబరు 4 - ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల పోరాట క్రమంలో కీలక అడుగులు పడుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ఎన్ జీ వో సంఘంతో మిళితమై ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక (జేఏసీ) రెవెన్యూ సర్వీసు అసోసియేషన్ ప్రధానంగా ఉన్న ఏపీ జేఏసీ అమరావతి కలిసి పని చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి.  ఐక్య వేదికల ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ మేరకు సమావేశమయ్యారు. ఒక అంగీకారానికి వచ్చారు. 
రాష్ర్టంలో ఉద్యోగుల పరిస్థితులు రాన్రాను ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయికి దిగజారిపోయాయి. ఎంతో బలంగా ఉండే ఉపాధ్యాయ సంఘాలు సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడితేనే కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు రుచి చూశారు. సంఘాల పరంగా వారికి ఉన్న హక్కుల విషయంలోను ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏపీ ఎన్ జీ వోల  ఆధ్వర్యంలో ఉన్న జేఏసీ సమావేశంలో ఇటీవల ఛైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాజా పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సర్వీసు కాలంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు అటు ప్రభుత్వంతో సానుకూలంగా ఉంటూ తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలనే విధానమే అవలంబిస్తూ వస్తున్నారు.  ప్రభుత్వంతో ఘర్షణ పడటం ద్వారా సాధించేదీ ఏమీ లేదని, నచ్చచెప్పి,భయాన కాకుండా నయానే ఉద్యోగుల పనులు సాధించాలనే దిశగా నాయకత్వాలు వ్యవహరిస్తున్నాయి.


పీఆర్సీ, డీఏలు, ఇతర డిమాండ్ల విషయంలో సానుకూల పరిణామాలు కనిపించడం లేదన్న అంతర్గత అసంతృప్తి నాయకుల్లో కనిపిస్తోంది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు కూడా ప్రభుత్వ అనుకూల శైలి అనుసరిస్తూనే అవసరమైన సమయంలో విమర్శలు చేస్తున్నారు. పీఆర్సీ, డీఏల విషయంలో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దసరా నాటికి పీఆర్సీ వస్తుందంటూ ఉద్యోగ సంఘాల నాయకులు అంతర్గతంగా సంకేతాలు ఇచ్చినా తాజా పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. దసరా తర్వాత ఇక పోరాట పథంలోకి వెళ్లక తప్పదన్న ఆలోచనల్లో బండి శ్రీనివాసరావు ఉన్నారు. ఇంతకుముందు ఇదే జేఏసీలో ఉన్న బొప్పరాజుతో కూడా కలిసి అడుగులు వేస్తే  రెవెన్యూ ఉద్యోగులతోను కలిసి కార్యాచరణ ప్రారంభించే దిశగానే ఈ అడుగులు పడుతున్నాయి. ఉద్యోగ ఉద్యమ పరంగా త్వరలో కొన్ని కీలక అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి.