ఏఎన్ఎంలపై పని భారం తగ్గించకపోతే
రోడ్లపైకి వస్తాం, ఉద్యమిస్తాం

-  ఉద్యోగుల కష్టాలపై సీఎం కమిటీ వేయాలి
- వైద్య ఉద్యోగుల సంఘం నేత ఆస్కార్ రావు

  (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
 అక్టోబరు 4 - వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది ముఖ్యంగా ఏ ఎన్ ఎం లపై పని భారం తగ్గించకపోతే తామంతా రోడ్లపైకి వస్తామని, ఉద్యమిస్తామని ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు జి.ఆస్కార్ రావు హెచ్చరించారు. ఉన్నతాధికారులు ఏ ఎన్ ఎం ల పై వేధింపులు ఆపకపోతే తాము ఊరుకునేది లేదని ఒక ప్రకటనలో హెచ్చరించారు. రెండు సంవత్సరాలుగా కరోనా కాలంలో విరామం లేకుండా విధులు నిర్వహిస్తున్న ఈ ఫ్రంట్ లైన్ వర్కర్లను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.  ఈ పరిస్థితిలో మార్పు తేకపోతే తాము విధులను సైతం బహిష్కరించి రోడ్లపైకి వస్తామని ఆస్కార్ రావు ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు.  ఆయన విమర్శలు ఇలా ఉన్నాయి...
- కరోనా విధులు నిర్వహిస్తున్నా సరైన పీపీఈ కిట్లు ఇవ్వడం లేదు.
- కోవిడ్ కేర్ సెంటర్లలో ఏఎన్ఎం లు తమ విధుల్లో భాగంగా కాకుండా సామాజిక దృక్పథం తో పని చేసినందునే కోవిడ్ ప్రస్తుతం తగ్గింది.
- ఏఎన్ఎంలను వ్యాక్సినేషన్ పేరిట క్షేత్రస్థాయిలో అర్థరాత్రి వరకు కూడా తిప్పుతున్నారు.
- ఛైన్ ప్రక్రియ సరిగా అమలవుతోందో లేదో కూడా సరిగా తనిఖీ చేయకుండానే వ్యాక్సిన్ లక్ష్యాలు పెడుతున్నారు.
- సాధారణ సిరంజిలు వాడమంటున్నారు. ఓటర్ల జాబితా ప్రకారం లక్ష్యాలు నిర్ణయిస్తున్నారు.
- ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రికి తెలిసి ఉండకపోవచ్చు.  ఆయనకు మేం పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధిస్తున్న తీరుపై సీఎం కమిటీ ఏర్పాటు చేయాలి.
- గతంలో చెప్పినట్లు యాప్ లు తగ్గకపోగా రోజుకు ఒక కొత్త యాప్ తీసుకువస్తున్నారు.
- ఇతర శాఖల ఉన్నతాధికారుల పెత్తనం నిరోధించాలి.