వ్యవసాయశాఖ మంత్రి జోక్యంతో
సద్దుమణిగిన వివాదం

- ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో ఆరా
- తాజా పరిణామాలపై ప్రభుత్వానికి నివేదిక
-  వ్యవసాయాధికారుల సంఘంతో మాట్లడిన పూనం
- త్వరలో చర్యలకు హామీ

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 9 -  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ కమిషనర్  తీరుపై  ఉద్యోగులు ఆందోళన బావుటా ఎగురవేయడంతో ప్రభుత్వం స్పందించింది. ఆ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సకాలంలో స్పందించి అన్ని స్థాయిల్లోను మాట్లాడి ప్రస్తుతానికి ఆందోళన సద్దుమణిగేలా చేశారు.  వ్యవసాయాధికారులు  ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారని తెలిసిన వెంటనే మంత్రి జోక్యం చేసుకున్నారు. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో ఈ విషయంపై చర్చించినట్లు తెలిసింది. వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకుని సమన్వయం చేయాలని, ఇందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి కన్నబాబు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి కార్యాలయం అధికారులు కూడా ఈ విషయంలో వ్యవసాయాధికారుల సంఘం, వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం నాయకులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని, ఆందోళన కార్యక్రమాలు విరమించుకోవాలని విన్నవించారు.
 వ్యవసాయశాఖ కమిషనర్ తీరుపై  వరుస ఆందోళన కార్యక్రమాలకు
 వ్యవసాయాధికారుల సంఘం పిలుపునిచ్చింది. పెన్ డౌన్ వరకు వెళ్లాలని నిర్ణయించింది. వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం కూడా వీరికి మద్దతు పలికింది.  సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమమూ చేపట్టారు. ఈ లోపు దిద్దుబాటు చర్యలు ప్రారంభం కావడంతో పాటు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి  సంఘం నాయకులు ప్రవీణ్ తదితరులకు వర్తమానం అందింది. సోమవారం సాయంత్రం కార్యాలయానికి రావాలని కబురు పంపారు. తాజా పరిస్థితులపై పూనం మాలకొండయ్య నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించినట్లు సమాచారం. ఆ తర్వాత వ్యవసాయాధికారుల సంఘానికి ఆమె గట్టి హామీ ఇచ్చారు. ఉద్యోగులు, అధికారుల ఆందోళనపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించాలని సూచించారు. ప్రభుత్వ హామీ మేరకు  వ్యవసాయాధికారులు తాత్కాలికంగా తమ ఆందోళనలు విరమించారు.