ప్రభుత్వ సలహాదారు సజ్జలతో
ఉద్యోగ సంఘాల నేతల భేటీ


- పీఆర్సీ నివేదిక బయట పెట్టే దిశగా అడుగులు...?
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్
)

అక్టోబరు 12 -   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. వెలగపూడిలోని రాష్ర్ట సచివాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం ప్రారంభమయింది. పీఆర్సీ అమలు, పెండింగు డీఏలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోందని సమాచారం.
ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీలు  ఎన్ జీ వో ఆధ్వర్యంలోని జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు.  ఇక ఓపిక పట్టలేమని తమ డిమాండ్లు  నెరవేర్చాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలోనే  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి వారితో మాట్లాడిన అంశమూ వివాదమయింది.
ప్రస్తుతం సజ్జల తో భేటీ అయిన వారిలో బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. తొలి సమావేశంలో సంక్రాంతి లోపు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘాల నేతలు తదుపరి విలేకరుల సమావేశంలో ఆ డిమాండ్ ను దసరా కు  మార్చారు. దసరా లోపు పీఆర్సీ ఇవ్వాల్సిందేనని  డిమాండ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏర్పడ్డ ఇబ్బందులు తొలగించే క్రమంలో కొన్ని దిద్దుపాటు చర్యల దిశగా ఈ సమావేశం అడుగులు వేసే అవకాశం ఉందని సమాచారం. తొలుత పీఆర్సీ నివేదిక త్వరలోనే బయట పెట్టేందుకు ఈ సమావేశం తొలి అడుగుగా అంచనా వేస్తున్నారు.