ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో
 ఉద్యోగ జేఏసీ నేతల చర్చలు...

- ముఖ్యమంత్రిని కలిసేందుకూ ప్రయత్నాలు
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 13-  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఏపీ ఎన్ జీ వో జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, హృదయరాజు, నారాయణరెడ్డి, శివారెడ్డి, అమరావతి జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు- వై వి రావు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు వీరితో చర్చిస్తున్నారు.
ఎన్నాళ్ల నుంచో పెండింగులో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ, సీపీఎస్ రద్దు, జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వడం తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సచివాలయంలో మంగళవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన వీరు ముఖ్యమంత్రి అపాయింట్ మెంటు  ఇప్పించాలని కోరారు. పీఆర్సీ అమలు విషయంలో ఆలస్యం అవుతుండటంతో పాటు ఇతర సమస్యల విషయంలోను ఉద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారని,  ఇక నిరీక్షించే ఓపిక ఉద్యోగుల్లో నశించిందని నేతలు ప్రభుత్వ పెద్దలకు వెల్లడిస్తున్నారు.  ఈ ఇద్దరు ముఖ్యులతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రితోను వీరు సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రికి ఉన్న అపాయింట్ మెంట్లు, సమావేశాల ఆధారంగా వీరి భేటి ఉందా లేదా అన్నది మరికొంత సేపటిలో ఖరారవుతుంది.