ఉద్యోగ సంఘాల ఎన్నికల తీరు మారనుందా! 


- రోసా నిబంధనలపై అధ్యయనానికి త్వరలో కమిటీ?
-  సీఎస్ తో భేటీలో ఇదీ చర్చనీయాంశమే...

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు. కామ్)
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఉద్యోగ సంఘాల ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియలో మార్పు తీసుకురానున్నారా? ఇందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందా?...అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ తరహాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ ఆలోచిస్తోన్న విషయంపై గతంలోనే ఉద్యోగులు.న్యూస్ లో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మరో ముందడుగు పడనుంది.
 రికగ్నేషన్ ఆఫ్ సర్వీసు అసోసియేషన్ రూల్సు (రోసా)పై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో త్వరలో ఒక  కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో  కొన్ని ఉద్యోగ సంఘాల నుంచే ఈ డిమాండ్ వచ్చినట్లు తెలిసింది.  రోసా రూల్సు అధ్యయనం చేసి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి వాటిని ఎలా మార్పు చేయాలో అధ్యయనం చేసేందుకు ఐఏఎస్ ల కమిటీని నియమించబోతున్నారు.
ఒక ఉద్యోగికి ఒకే సంఘంలో సభ్యత్వం ఉండాలని, ఒక ప్రభుత్వశాఖకు సంబంధించి ఒకే గుర్తింపు సంఘం ఉండాలని తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం 700 మంది ఉద్యోగులు ఉన్న క్యాడర్ లోనూ ముూడు సంఘాలు ఉన్నాయని ...ఇలాంటి అనేక అంశాలపై కూడా అధ్యయనం చేయాల్సి ఉందని కొందరు సూచిస్తున్నారు. ఉద్యోగ సంఘాలకు ఎన్నికలు నిర్వహించే తీరులోను మార్పులు చేసే ప్రతిపాదనలూ చర్చకు వస్తున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా అధికారికి సంఘాలను నిర్ణయించేందుకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు తెర తీయాలనే అంశంపై చర్చ సాగుతోంది.

ఎక్కువ మందిచదివినవి