కాకినాడలో కదంతొక్కిన కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు 

క్రమబద్ధీకరించాలంటూ గర్జన మండుటెండలో 3 గంటలపాటు ధర్నా
భారీ మానవహారం
మాట తప్పొద్దు..మడమ తిప్పొద్దు
ముఖ్యమంత్రి జగన్ కు ఉద్యోగ సంఘాల నేతల విజ్నప్తి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)‌- జులై 19
ప్రభుత్వసర్వీసులోకి తమను క్రమబద్ధీకరించాలని సుదీర్ఘకాలంగా పోరాడుతున్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సోమవారం నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. తొలుత ఉదయం 9 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద  బైఠాయించి దాదాపు మూడు గంటల పాటు మండుటెండలో ధర్నా నిర్వహించారు. తమను  క్రమబద్ధీకరించాలని  పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో, అంతకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో.. అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి  తీరతానని మాట ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ టి. రమణారెడ్డి  ఈ సందర్భంగా కోరారు. ముఖ్యమంత్రి మాట తప్పరని  ఇప్పటికీ తాము భావిస్తున్నామని మరో కన్వీనర్ యాళ్ల మోహన్ అన్నారు. ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి తమను రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశగా రెండేళ్లపాటు ఎదురు చూశామని మరో కన్వీనర్ నీల రాంబాబు చెప్పారు.  ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకే  50 రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు నిరవధిక నిరసన కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగానే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో డి.ఎం.హెచ్.ఓ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టామని  కన్వీనర్ ఎ.వి.శేషయ్య పేర్కొన్నారు.  నిరసనలో జి.వి.వి.ప్రసాద్, బట్టు విజయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

జడ్పీ జంక్షన్లో నినాదాల హోరుతో మానవహారం!

డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం నుంచి కలక్టరేట్ మీదుగా జిల్లా పరిషత్ జంక్షన్ వరకూ కాంట్రాక్టు ఉద్యోగులు కదంతొక్కారు. జడ్పీ జంక్షన్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలలనుండి తరలివచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్ ని దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తూ నినదించారు.  జిల్లా జేఏసీ నాయకులు జి.సుభాష్, ఎస్.కె.అలిషాబాబా, వేమగిరి అబ్బులు, ప్రభాకరరావు, శ్రీధర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యుల సంఘం నాయకులు యూనస్, రాష్ట్ర జేఏసీ నాయకులు పి.జానీ, చంద్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నాకు కదలి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు!
సోమవారం కాకినాడలో జరిగిన కాంట్రాక్టు ఉద్యోగుల భారీ నిరసన కార్యక్రమానికి ఉద్యోగ సంఘాల ప్రధాన నాయకులు తరలివచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కారరావు విశిష్ట అతిధి గా పాల్గొని ప్రసంగించారు.  అర్హులైన కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో గత ప్రభుత్వాల బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా నడుస్తుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.  మాటతప్పవద్దని, మడమ తిప్పవద్దని ముఖ్యమంత్రి జగన్ ను కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది కోరుతున్నారని ఆస్కార్ రావు చెప్పారు. పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నవారిని క్రమబద్ధీకరించాలని ఉమాదేవి వర్సెస్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  ఉన్నతాధికారుల మాటలు నమ్మి కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేయవద్దని కోరారు. మాట నిలబెట్టుకోని పక్షంలో తమ సంఘం ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తాము వెన్నంటి ఉంటామన్నారు. సి ఐ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసరావు  మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోతే తాము ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వై ఎస్ ఆర్ టి యు సి ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్.రమేష్ మాట్లాడుతూ  కొవిడ్ కష్టకాలంలో ఎంతో విలువైన వైద్య సేవలు అందించిన కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు.


కడప జిల్లాలోనూ నిరసన
కడప జిల్లాలోనూ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు నిరసన గళం వినిపించారు.  రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలోని యండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాధవరం ఆరోగ్య ఉప కేంద్ర పరిధిలో జురుకువాండపల్లి, ప్రాథమిక పాఠశాలలో నిరసన చేపట్టారు. సోమవారం జ్వరాలపై సర్వే తదితర  విధులు నిర్వహిస్తూనే నిరసన తెలిపారు. డీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, కరోనాతో మరణించిన కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులకు కూడా రూ.25 లక్షలు  చెల్లించాలని డిమాండ్ చేశారు.  రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘం నివేదికను సత్వరం తెప్పించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ప్రముఖ ప్రాధాన్యతం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ  రాష్ట్ర కన్వీనర్ యర్రపు రెడ్డి విశ్వనాథరెడ్డి , మాధవరం ఏఎన్ఎం ఆర్ జయసుధ, మహిళా పోలీస్ ప్రతీతి బ్లెస్సీనా, ఆశ కార్యకర్త బి.గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.