ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి నేనే అధ్యక్షుడిని


-ఎస్.శ్రీనివాసరావు స్పష్టీకరణ
-విజయవాడ సంఘ కార్యాలయంలో అత్యవసర రాష్ట్ర కార్యవర్గం సమావేశం
-కొండయ్యపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 20:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడిని తానేనని సంసాని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  గత ఏడాది అక్టోబరులో కాకినాడలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు చెప్పారు. వాస్తవం ఇలా ఉండగా డి.ఎస్. కొండయ్య అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ సంఘ కార్యాలయంలో మంగళవారం తన అధ్యక్షతన అత్యవసర రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.  గత ఏడాదే ఎన్నికలు జరగగా  ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించినట్లు ఎలా ప్రకటిస్తారని శ్రీనివాసరావు విమర్శించారు.  గత ఏడాది కాకినాడలో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాలకు గాను తొమ్మిది జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, రెండు ప్రత్యేక యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు  చెప్పారు.  కొండయ్యను ప్రాథమిక సభ్యత్వం నుంచి గత ఏడాది అక్టోబరులోనే తొలగించామని, ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు.  జి. శ్రీరాములు ఇప్పటికే పదవీ విరమణ చేశారని, ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని, ఆయనను ఇప్పటికే సంఘం నుంచి బహిష్కరించినందున ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి, ఆయనకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.  కొండయ్య, శ్రీరాములు.. రాష్ర్ట ప్రభత్వ డ్రైవర్ల సంఘాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు.  తమ సంఘానికి బీ.వో. ఎం.ఎస్. నెంబర్. 2103 ద్వారా 1965లో గుర్తింపు లభించిందని గుర్తు చేశారు.  ఎన్నో ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కరించిన చరిత్ర తమదని చెప్పారు.  అమరావతి జేఏసీ పేరుతో ఉన్న ఒక బూటకపు సంఘంతో లాలూచీ పడి కొంతమంది డ్రైవర్లు, డి. ఎస్. కొండయ్య తమ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 


కొండయ్య ప్రాథమిక సభ్యత్వం  రద్దు చేసినా ఇంకా తమ సంఘం లెటర్ ప్యాడ్ ఉపయోగిస్తూ తనను సంఘం అధ్యక్షుడిగా గుర్తించమంటూ ప్రభుత్వానికి, అధికారులకు లేఖలు రాయడాన్ని శ్రీనివాసరావు తప్పుబట్టారు. ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ర్ట కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు.  
జి.ఒ. నం. 5 ను ప్రభుత్వం తక్షణమే రద్దుచేయాలని,  ఒక శాఖలో డ్రైవర్లు ఎక్కువగ ఉన్నట్లయితే వేరే శాఖలకు డిప్యుటేషన్ల పై డ్రైవర్లు గా మాత్రమే పంపాలని   ఈ సందర్భంగా శ్రీనివాసరావు కోరారు. వాహనాల మరమ్మతుల కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని  కార్యవర్గ సమావేశం కోరింది. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. నాగేశ్వర్ రావు, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కోశాధికారి కె. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.