సొంత జిల్లాల్లో పని చేసే అవకాశమివ్వండి


ప్రభుత్వానికి యూటీఎఫ్ విజ్ఞప్తి
విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 20:  అంతర్ జిల్లా బదిలీలలో సొంత జిల్లాలకు వెళ్లగోరేవారికి ప్రత్యేక అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి  యూటీఎఫ్ విజ్ఞప్తి చేసింది.  ఈమేరకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ విద్యాశాఖ మంత్రికి  మంగళవారం విజ్ఞాపన పత్రం అందజేశారు. 
అంతర్ జిల్లా బదిలీల్లో స్పౌజ్ కేటగిరీ వారికి, పరస్పర అంగీకార బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అవకాశమిచ్చిందని, దీంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాలలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అనేకమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని,  గడిచిన 15 సంవత్సరాలుగా సొంత జిల్లాలకు వెళ్లడానికి అవకాశంలేక పలు ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.  ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికి సమస్య పరిష్కారం కాలేదన్నారు.
సొంత జిల్లాలలో పని చేసేందుకు అవకాశమిస్తామని గతంలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో మంత్రి ఇచ్చిన హామీ అమలు కాలేదని, ఇప్పుడైనా  ఒక అవకాశం కల్పించి సొంత జిల్లాలకు వెళ్లేందుకు అనుమతించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.   ఈ అంశాన్ని  తప్పనిసరిగా పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.