వేతన స్థిరీకరణలో అక్రమాలను అరికట్టాలి 
 

టీపీటీఎఫ్ డిమాండ్


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 21: ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణలో భాగంగా చేపడుతున్న ప్రక్రియలో కింది నుంచి పై స్థాయి వరకు కొంతమంది ఉద్యోగులు, అధికారులు డబ్బులు వసూలు చేస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని టీపీటీఎఫ్ ఆరోపించింది. అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. వేతన స్థిరీకరణ ప్రక్రియలొ పరిశీలన, బిల్లుల తయారీ, ట్రెజరీ కార్యాలయంలో సమర్పణ, మంజూరు వంటి వివిధ దశల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని  టీపీటీఎఫ్ అధ్యక్షుడు కె.రమణ, అసోసియేట్ అధ్యక్షుడు వై. అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్.తిరుపతి ఒక ప్రకటనలో ఆరోపించారు. మూడేండ్ల నిరీక్షణ తర్వాత పొందుతున్న వేతన సవరణ ఉపాధ్యాయ, ఉద్యోగుల హక్కని వారు స్పష్టం చేశారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా డీడోవలదని చెప్పారు.  అయితే  బిల్లులు త్వరగా రూపొందించాలంటే లేదా ట్రెజరీ కార్యాలయంలో తొందరగా మంజూరు చేయాలంటే డబ్బులు సమర్పించాల్సిందే అంటూ కొంతమంది ఒత్తిడి చేస్తూ అవినీతికి పాల్పడుతూ, వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అవినీతిని అరికట్టి, అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వారిపై విచారణ జరిపి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని  ఖజానా శాఖ అధికారులను డిమాండ్  చేశారు.