సీఎస్ లు మారుతున్నా సీపీఎస్ రద్దు ఏదీ?

- సమావేశం అంటూ ఏడాది కానిచ్చేశారు
- 2 లక్షల మంది ఉద్యోగులు ఉసూరు
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 22- ఆంధ్రప్రదేశ్ లో రెండు లక్షల మంది ఉద్యోగుల తమ భవిష్యత్తు పెన్షన్ పై బెంగ పడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని కిందటి ప్రభుత్వ  హయాంలో పెద్ద ఉద్యమాన్ని నిర్మించి అడుగులు ముందుకు వేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే  సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇవ్వడంతో పాత ప్రభుత్వం ప్రతిపాదించిన టక్కర్ కమిటీ అంశాలను కూడా పరిశీలించకుండా ‘ ఎవరయితే సీపీఎస్ రద్దు చేస్తారో, వారికే మా మద్దతు’ అంటూ బహిరంగంగా ప్రకటించారు. జగన్ పాదయాత్రలో అనేక చోట్ల వీరు వినతిపత్రాలు సమర్పిస్తే ఆయన రద్దు భరోసా ఇచ్చారు.
రెండేళ్లుగా...
రెండు లక్షల మంది ఉద్యోగులు రెండేళ్లుగా సీపీఎస్ రద్దు కోసం ఎదురుచూస్తున్నారు. కిందటి ఏడాది ఆగస్టు 31న ముఖ్యమంత్రిని సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు కలిశారు. వారం, పది రోజుల్లో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీపీఎస్ పై సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఆ సమావేశం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు.
- మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘం తమ బాధ్యతలను అధికారుల సంఘానికి అప్పచెప్పిందని, తాము నివేదిక ఇవ్వడం లేదని ఈ మధ్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక ప్రధాన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో  కమిటీ దీన్ని అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నీలం సాహ్ని సీఎస్ పదవి నుంచి విరమణ చేశారు.  ఆ తర్వాత వచ్చిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆరు నెలల పదవీ కాలం పూర్తయింది. మరో మూడు నెలలు ఆయనకు పదవీకాలం పొడిగించారు. అది కూడా సెప్టెంబరు నెలాఖరుతో ముగియనుంది.
సీఎస్ లు పదవులు దిగిపోతున్నా సీపీఎస్ రద్దుపై తేల్చడం లేదన్న విమర్శలు ఉద్యోగుల్లో గుప్పుమంటున్నాయి.  సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కిందటి ఏడాది పెన్షన్ దినోత్సవానికి ముందు ఆన్ లైన్ లో ఉద్యోగులంతా ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.  పండిట్ కన్సల్టెన్సీకి అప్ప చెప్పామని వారు అధ్యయనం చేస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వం ప్రకటించింది.  ఉద్యోగులతో ఇదిగో సమావేశం, అదిగో సమావేశం అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా ఏడాదిగా సాగదీత తప్ప సాధించింది శూన్యమన్న అసంతృప్తిలో ఉద్యోగులు ఉన్నారు.
సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినంగా పాటించారు. ఈ ఏడాదిలో సీపీఎస్ రద్దుకు సంబంధించి ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు వినతిపత్రాలు ఇవ్వడం మినహా సాధించింది ఏమీ లేదని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు.