గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు, క్రెడిట్లు వద్దు

ఉద్యోగులు న్యూస్.కామ్ 

ఎటువంటి పరీక్షలు లేకుండా రాబోయే అక్టోబర్ 2 నాటికి గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని  గ్రామ,వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.జాని పాషా డిమాండ్ చేశారు.  కొన్ని రోజులుగా గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచి విడుదల అవుతున్న ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా ముప్ఫయి నాలుగువేల మంది సచివాలయ ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.  నాడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం  ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి ప్రొబేషన్ పూర్తి చేసి సాధారణ పే స్కేల్ పొందాల్సి ఉందని చెప్పారు.  వీటిలో కొన్ని రకాల ఉద్యోగాలకు ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణులవ్వాలని  నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారని అయితే గత ఏడాదిన్నర నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా కేవలం ఒక్కసారి మాత్రమే డిపార్ట్మెంట్ పరీక్షలు జరిగాయని  గుర్తు చేశారు.  ఈ ఒక్కసారి జరిగిన పరీక్షలలో దాదాపుగా 50 నుండి 60శాతం సచివాలయ ఉద్యోగులు ఉత్తీర్ణత పొందారని తెలిపారు.   22 నెలలుగా చాలీ చాలని రూ.15000వేల జీతంతో, భవిష్యత్తు పై ఆశతో,ప్రతి సచివాలయ ఉద్యోగి రాత్రనక,పగలనక ఆదివారాలు,పండుగ సెలవలు అనేవి ఏవి పట్టించుకోకుండా అధికారులు ఏ పని అప్పగించినా నిర్విరామంగా అంకిత భావంతో పనిచేశారని చెప్పారు.  40క్రెడిట్లతో ఉత్త్తీర్ణత సాధిస్తేనే ప్రొబేషన్ ఇస్తామంటే రెండేళ్లు కష్టపడిన అనేకమంది సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి నేరుగా ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ వర్తింపజేయాలని కోరారు.