పూర్తి జీతం ఉద్యోగుల హక్కు


* జీవో 27 సవరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
* కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బందికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ హామీ
* సర్వీసు క్రమబద్ధీకరణపైనా నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 22: ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.  వారి సర్వీసును క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్.. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీకి హామీ ఇచ్చారు.  అంతే కాకుండా వారి వేతనానికి సంబంధించి 27 జీవో సవరణపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆదిత్యనాథ్ చెప్పారు.  ఈ విషయాలను  ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ కన్వీనర్ ఎస్. జాన్ హెన్రీ ఒక ప్రకటనలో తెలియజేశారు. 
డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ తరఫున గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యదర్శి అరవా పాల్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యనాథ్ ని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించి సమస్యలను వివరించినట్లు తెలిపారు.  తమ డిమాండ్లపై ఆదిత్యనాథ్ సానుకూలంగా స్పందించినట్లు హెన్రీ తెలిపారు. 
53వ రోజుకి చేరిన కాంట్రాక్ట్  పారామెడికల్ ఉద్యోగుల ధర్నా గురించి ఆదిత్యనాథ్ కు వివరించగా  ఈ కార్యక్రమాన్ని  తాను మొదటి నుంచి గమనిస్తున్నానని ’’కచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.‘‘  అని చెప్పారని వెల్లడించారు.  అయితే క్రమబద్ధీకరణపై రాజకీయంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున విధానపరమైన నిర్ణయానికి సమయం పడుతుంది అని ప్రభుత్వ కార్యదర్శి చెప్పినట్లు తెలిపారు. 
జీవో 27 సవరణ డిమాండ్ గురించి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లగా ’’ప్రభుత్వం దీనిపైనా సానుకూలంగా ఉంది. పూర్తి జీతం కచ్చితంగా ఉద్యోగి కనీస హక్కు. త్వరలో నిర్ణయం తీసుకుంటాం.‘‘  అని ఆదిత్యనాథ్ హామీ ఇచ్చినట్లు హెన్రీ తెలిపారు. 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ గడువు ముగిసినందున వెంటనే నివేదిక సమర్పించాలని సూచించాలని ఆదిత్యనాథ్ కు కమిటీ విజ్ఞప్తి చేసింది.  దీనిపై ఆదిత్యనాథ్ స్పందిస్తూ మంత్రుల బృందం, వర్కింగ్ కమిటీ ప్రస్తుత స్థితిని అడిగి తెలుసుకున్న తర్వాత వర్కింగ్ కమిటీ సూచనలను త్వరగా తెప్పించుకునే ప్రయత్నం చేసి, వాటి ద్వారా కాంట్రాక్ట్ పారామెడికల ఉద్యోగులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు హెన్రీ తెలిపారు.  ఈ కార్యక్రమంలో అన్ని విధాలా సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యదర్శి అరవా పాల్, ఏపీహెచ్ఎఎంఎస్ఏ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావుకు ధన్యవాదాలు తెలిపారు.