క్రమబద్ధీకరణ సాధనకోసం ఉద్యమానికి సన్నద్ధమైన ఉత్తరాంధ్ర
 

సోమవారం శ్రీకాకుళం, విశాఖలో నిరసనలకు కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు సమాయత్తం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 24:  తక్షణమే తమ సర్వీసును  క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో సోమవారం కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు నిరసనోద్యమానికి దిగుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు జి.వి.వి.ప్రసాద్, డి.సాయి ప్రసాద్ శనివారం రాత్రి మీడియాకు తెలియజేశారు. తాము పేరుకే కాంట్రాక్ట్ ఉద్యోగులమని, శాశ్వత ఉద్యోగులను  విధానంలో తీసుకుంటారో అదే విధానంలో తమను నియమించారని వారు స్పష్టం చేశారు. పత్రికా ప్రకటన ఇవ్వడం,  జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడం, ఆర్డర్ ఆఫ్ మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు పాటించడం వంటి ప్రక్రియలన్నీ పాటించే తమను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. 20 ఏళ్లుగా తాము చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితాలు అనుభవిస్తున్నామని డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 
ప్రభుత్వానికి తమ బాధ, ఆవేదన తెలియజెప్పేందుకు సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లోని  వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమానికి  ఈ ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు.
కోవిడ్ నియంత్రణలో కీలక భూమికను పోషిస్తూ అదే కోవిడ్ కు బలై పోయిన వారు కొందరైతే...  తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం లేదనే మానసిక వేదన తట్టుకోలేక తనువులు చాలిస్తున్నావారు ఇంకొందరని డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం అందక రోడ్డున పడుతున్నారని విచారం వ్యక్తం చేసింది. 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో,ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికార పార్టీని నిలదీసే సందర్భంలోనూ.. అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగులను వీలైనంత మందిని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు గుర్తు చేశారు. 
మొదట్లో ఇచ్చిన నియామక ఉత్తర్వుల  ప్రకారం తమకు జీతాలు నూరు శాతం గ్రాస్ శాలరీ, బేసిక్, హెచ్.అర్.ఏ, డి.ఏ లను గత  పదిహేను సంవత్సరాలుగా ఇస్తూ ఎప్పటికప్పుడు పీఆర్సీ లను కలుపుతూ ఉండేవారని, దీంతో జీతం పెరుగుతూ వచ్చేదని చెప్పారు. 2018లో గత తెలుగుదేశం  ప్రభుత్వం జీఓ నంబర్ 27 తెచ్చి తమకున్న ఆర్థికపరమైన అవకాశాలు అన్నింటినీ అన్యాయంగా తీసేసి ఒక్క గుత్త గా జీతాలు ఇస్తూ తమకు తీవ్ర అన్యాయం చేసిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు జి.వి.వి.ప్రసాద్, డి.సాయి ప్రసాద్  విజ్ఞప్తి చేశారు.