ఉత్తరాంధ్ర నడిబొడ్డున కాంట్రాక్టు ఉద్యోగుల గర్జన

- క్రమబద్ధీకరించాలంటూ డిమాండు

- పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యోగులు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 26 - కాంట్రాక్టు ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమను రెగ్యులర్ చేయలేదని వారు ఆగ్రహంతో ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలో సోమవారం కాంట్రాక్టు పారా మెడికల్ జేఏసీ తరపున ఉత్తరాంధ్ర గర్జన నిర్వహిస్తున్నారు. అనేక జిల్లాల నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు వందల సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నేతలు డిమాండ్ చేశారు. ఎన్నిలకు ముందు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి...అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మంత్రివర్గ ఉపసంఘం నియమించారని, అధికారుల కమిటీని నియమించారని, ఆ కమిటీల గడువు తీరిపోయినా ఇప్పటికీ రెగ్యులరైజేషన్ విషయం పట్టించుకోవడం లేదని పారా మెడికల్ జేఏసీ నేతలు తమ ప్రసంగాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులర్ అవుతామని అనుకుంటూనే అనేక మంది పదవీ విరమణ చేశారని, వారికి ఎలాంటి ప్రయోజనాలూ అందని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మరికొందరు పారా మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు చనిపోయారని, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పారా మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ జి.వి.వి.ప్రసాద్, వై మోహన్, టి.రమారెడ్డి, వి.ఎన్.వి.ఆర్.కిషోర్, కె.రత్నాకర్ బాబు, కె.చంద్రకిరణ్, బి.విజయవర్థన బాబు, ఎ.జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. టీఎన్ టీయూసీ నుంచి శ్రీనివాసాచారి, వైద్య ఉద్యోగ సంఘాల నుంచి విజయలక్ష్మి, సాంబమూర్తి, స్వర్ణలత, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. 

వైద్య ఉద్యోగుల సంఘం నేత, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు , జిల్లా నేత టి.చంద్రరావు, రాష్ర్ట ఎన్ జీ వో అసోసియేషన్ నుంచి ఎం.పరమేశ్వరరావు, కె.ఈశ్వరరావు, నారాయణరావు, సీహెచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.