రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక ఉద్యోగుల సమస్యలు పరిష్కారం.

 

• ముఖ్యమంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు

• ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 

ఆగస్టు 17: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి  హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు.  ప్రస్తుతం కరోనాతో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని,  సమస్యలపై తాము సంయమనంతో ఉన్నామని పేర్కొన్నారు. మంగళవారం వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ఎంపీడీఓలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమకు పదోన్నతులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ విషయాన్ని వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.  ఎంపీడీవోలు పదోన్నతులు లేకుండా పాతికేళ్లుగా ఇబ్బందులు పడ్డారని, ఎంపీడీవోల ఆవేదనను సీఎంకు తెలపగా సమస్యను పరిష్కరిస్తానని కొద్దిరోజుల క్రితం హామీ ఇచ్చారని గుర్తు చేశారు.  పదోన్నతులు ఇచ్చే దస్త్రాన్ని సీఎం జగన్ ఇప్పటికే  ఆమోదించారు. 250-300 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు ఇచ్చేందుకు  ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని,  దీనివల్ల పంచాయతీరాజ్ లోని 2500 మంది కిందిస్థాయి సిబ్బందికీ పదోన్నతులకు అవకాశం కల్గిందని చెప్పారు.

ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు లేకుండా ఇబ్బందులు పడ్డామని,  ముఖ్యమంత్రి జగన్ తమకు పదోన్నతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఎంపీడీవోలసంఘం  రాష్ర్ట అధ్యక్షుడు వై బ్రహ్మయ్య తెలిపారు. తాము  వందకు వందశాతం బాధ్యతతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు.