నెలకు రూ.500తో ఎలా బతకాలి?
 

•    సీపీఎస్ తో పదవీవిరమణ తర్వాత కొంతమంది ఉద్యోగులకు వచ్చేది ఇంతే
•    ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్క రోజు పదవిలో ఉన్నా జీవితాంతం పింఛను
•    ఉద్యోగులను మాత్రం చెరకు గడలా నమిలి  వదిలేయడం ఏం న్యాయం?
•    మా డబ్బుతో ఎవరినో బాగు చేయడమేమిటి?
•    షేర్ మార్కెట్లో పెడితే మా డబ్బుకు ఎవరిది పూచీ?
•    ఈ ముఖ్యమంత్రిని విశ్వసించాం
•    అయినా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు
•     సీపీఎస్ రద్దు చేసి నాలుగు లక్షల కుటుంబాల్లో వెలుగు నింపాలి
•    సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు రామాంజనేయులు
•    ఉద్యోగులు.న్యూస్ ఇంటర్వ్యూ రెండోభాగం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
ఆగస్టు 21: 
పదవీ విరమణ చేసేటప్పటికి వృద్ధాప్యం మీదకు వస్తూ ఉంటుంది.  అప్పటికి అందరికీ బాధ్యతలు పూర్తిగా తీరి ఉండవు. బాధ్యతల బరువు ఒకవైపు, ఆరోగ్య సమస్యలు మరోవైపు, ద్రవ్యోల్బణం దాటికి పెరిగే ధరలు మరోవైపు.. వీటన్నింటినీ తట్టుకోవాలంటే నెలకు కనీసం రూ. 10వేలైనా ఉండాలి.  కానీ పింఛను రూపంలో వచ్చేది రూ.500 నుంచి రూ.వెయ్యి మాత్రమే అయితే వారు బతుకు బండి ఎలా సాగిస్తారు? సీపీఎస్ ఉద్యోగుల్లో పెద్ద ఆందోళన ఇదే.  ఈ అంశంపై ఎన్నాళ్లనుంచో పోరాడుతున్న సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రామాంజనేయులతో ఉద్యోగులు.న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ రెండో భాగం..


ఉద్యోగులు.న్యూస్: సీపీఎస్ పై  ఠక్కర్ కమిటీ నివేదికలో ఏం చెప్పింది?
రామాంజనేయులు:   ఠక్కర్ అప్పట్లో ఉద్యోగ సంఘాలందరితో మాట్లాడారు. సీపీఎస్ రాష్ర్ట సంఘం అధ్యక్షుడిగా నన్ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు.  మీకు నాలుగు ప్రత్యామ్నాయాలు సూచిస్తాను. అందులో దేనికి మీరు అంగీకరించినా దానికి చట్టబద్దత కల్పించే పూచీ నాది అని చెప్పారు. మాకు ఎటువంటి ప్రత్యామ్నాయాలూ వద్దు, పాత పింఛను విధానమే కావాలని అని స్పష్టంగా చెప్పాను. ఇప్పటికీ మాది అదే మాట.  
ఉద్యోగులు.న్యూస్:   ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిని అప్పట్లో కలిసి విజ్ఞప్తి చేశారు కదా? ఆయన ఏమన్నారు?
రామాంజనేయులు:  ఒకసారి కాదు.. ఆయనను పదిసార్లు కలిసి విన్నవించాం.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తాం. ఆ సమావేశంలో మీ అభిప్రాయాలు చెప్పండి, ప్రభుత్వ అభిప్రాయాలు మేము చెబుతాం అని చెప్పారు.  అయితే ముఖ్యమంత్రి మాత్రం కేబినెట్ సమావేశంలో... సీపీఎస్ రద్దుకు నేను మాట ఇచ్చాను కాబట్టి రద్దు చేసి తీరాల్సిందే అని స్పష్టం చేసినట్లు మాకు తెలిసింది. అయితే సీపీఎస్ రద్దు చేస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి భారమవుతుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్ భావించి బెంగళూరుకు చెందిన పండిత్ కన్సల్టెన్సీతో నివేదిక తెప్పించుకున్నారు.  ఆ నివేదికలో ఏముందో ఇప్పటివరకు బయటపెట్టలేదు. మాకు ప్రెజెంట్ చేస్తామని చెప్పినా ఇంతవరకు దాన్ని బయటపెట్టలేదు. ఒక వేళ మాకు నివేదికను బహిర్గత పరిస్తే ఏ విధంగా లాభమో, ఏ విధంగా నష్టమో మా అభిప్రాయం చెప్పేవాళ్లం. వారంలోనే రద్దు చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రెండేళ్లు గడిచిపోయినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం దురదృష్టకరం,శోచనీయం. 
ఉద్యోగులు.న్యూస్:  ముఖ్యమంత్రి ఇంత స్పష్టంగా హామీ ఇచ్చినా అధికారుల స్థాయిలో నే ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్నారా?
రామాంజనేయులు: నేను అదే భావిస్తున్నాను. ఎందుకంటే అధికారులు, సీపీఎస్ నాయకులు కూర్చొని ఒక అవగాహనతో వస్తే తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.  ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు దాదాపు రెండు లక్షల కుటుంబాలు ఆ రోజు ఆయన వెంట నడిచాయి. ఈ రోజు ఆర్టీసీ కార్మికులు 54వేల మంది ఉన్నారు. అక్టోబరులో రెండు లక్షలమంది గ్రామ సచివాలయ సిబ్బంది రాబోతున్నారు. అందరం కలిసి నాలుగు లక్షల మంది ఉద్యోగులం కాబోతున్నాం. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటే నాలుగు లక్షల కుటుంబాల్లో వెలుగు నింపుతుంది.  మేము ఈ ముఖ్యమంత్రిని విశ్వసించాం.  అందుకే ఆ రోజు ఆయన వెంట నడిచాం.  దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోవాలి. ప్రస్తుతం నేను వ్యక్తిగతంగా జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నేను ఆ రోజు ఉద్యోగులను నమ్మించాను. పాత పెన్షన్ కావాలంటే ఆయన వెంట నడవాలని ఒప్పించాను. 
ఉద్యోగులు.న్యూస్:  ప్రభుత్వఖజానాపై భారం పడుతుందనో, కేంద్ర ప్రభుత్వం విధానానికి అనుగుణంగానే వెళ్లాలనో ప్రభుత్వం భావిస్తోందని అనుకోవచ్చా?
రామాంజనేయులు- కేంద్రం అమలు చేస్తోందని రాష్ట్రాలు అమలు చేయడం సరికాదు. మేము ఈ పద్ధతిని వ్యతిరేకిస్తాం.  రాష్ర్ట ప్రభుత్వాల్లోని ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు పూర్తిగా రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోని అంశమని రాజ్యాంగంలోని 309వ అధికరణం స్పష్టం చేస్తోంది.  కేంద్రం 2004 జనవరి1న సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏపీలో 2004 సెప్టెంబరు 1న అమల్లోకి తెచ్చింది. కర్ణాటక 2006లో తీసుకొచ్చింది. త్రిపురలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమల్లోకి తీసుకొచ్చారు. పశ్చిమ బెంగాల్లో సీపీఎస్ విధానాన్ని అమలు చేయడం లేదు.  మేము సీపీఎస్ ను అమలు చేస్తున్నాం,కావాలంటే మీరు కూడా అమలు చేసుకోవచ్చు అని మాత్రమే కేంద్రం చెప్పింది. 
ఇక భారం విషయానికొస్తే.. నేనొక్కటే అడగదల్చుకున్నా.  ఎమ్మెల్యే గానో, ఎమ్మెల్సీ గానో, ఎంపీగానో ఎన్నికయిన వారు  ఒక్కరోజు మాత్రమే ఆ పదవిలో ఉన్నా జీవితాంతం పింఛను తీసుకుంటున్నారు కదా! మరి మీ జీవితాలను అంత చక్కగా రాసుకుని, దాదాపు 25, 30 ఏళ్ల పాటు ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న ఉద్యోగుల్ని చెరకుగడలా వాడుకుని వదిలేయడం ఎటువంటి న్యాయం? 
మరో విషయం... ప్రస్తుతం రాష్ర్ట బడ్జెట్ రూ.రెండు లక్షలకోట్లు పైనే.  మేము పదవీ విరమణ చేసేనాటికి ద్రవ్యోల్బణం పెరిగి బడ్జెట్ కూడా పెరుగుతుంది కదా.  మరి భారం అనుకుంటే ఎలా? ప్రస్తుతం పదవీవిరమణ చేసిన వారిలో నెలకు రూ. 550, రూ.వెయ్యి మాత్రమే పింఛను తీసుకుంటున్న వారున్నారు. ఉదాహరణకు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వీఆర్ఏలుగా నియమితులయి వీఆర్ఓలుగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేసిన వారి ప్రాన్ కార్డులో రూ.3లక్షల నుంచి రూ.4లక్షలున్నాయి. అందులో 60శాతం వెనక్కి ఇచ్చారు. 40శాతం సొమ్ముతో యాన్యువిటీలు కొనుక్కోవాలి. ఆ యాన్యువిటీలకు వస్తున్న ప్రతిఫలం రూ.వెయ్యిలోపే వస్తోంది.  ఇలా అయితే ఎలా బతకాలి?  పైగా ప్రభుత్వ ఉద్యోగి అయిన పాపానికి వృద్ధాప్య పింఛను సహా  ప్రభుత్వం అందించే ఏ ఇతర పథకానికీ అర్హులు కారు.  తెల్లరేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం లేదు. భారతపౌరులయినందుకు ఒక్క ఆధార్ కార్డు మాత్రమే దక్కుతోంది.  60 ఏళ్ల పాటు పని చేసిన తర్వాత మానసిక ఒత్తిడితో రక్తపోటో,మధుమేహమో ఇతరత్రా ఆరోగ్య సమస్యలొస్తే డాక్టరు దగ్గరకు వెళ్లడానికి ఈ పింఛను ఏ మాత్రం సరిపోదు.  ఇంటి అద్దెకు కూడా చాలడం లేదు. 
ఉద్యోగులు.న్యూస్:  మీ జీతం నుంచి వసూలు చేసే 10శాతం డబ్బుకు భరోసా  ఉందా?
రామాంజనేయులు : ఏదైనా ప్రభుత్వ పథకంపెడితే అది ప్రభుత్వానికో, ప్రజలకో, ఉద్యోగులకు లబ్ధి చేకూర్చాలి కానీ ఎవరో పెట్టుబడిదారుడిని ప్రోత్సహించడమేమిటి? ఎక్కడో కూర్చొన్న పెట్టుబడిదారుడి కోసం ప్రభుత్వం మా వద్ద నుంచి పదిశాతం డబ్బు ముక్కు పిండి వసూలు చేసి వారికి ఇవ్వడం ఏమిటి?  వారికి పీఆర్వోలాగా ప్రభుత్వం వ్యవహరించడమేమిటి?  ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?. ఈ డబ్బును షేర్ మార్కెట్లో పెడుతున్నారు కదా.. అసలే రాకపోతే దీనికి ప్రభుత్వం పూచీ ఏమైనా ఉంటుందా? అని అప్పట్లో ఆర్థిక మంత్రి చిదంబరాన్నిఅడిగితే ప్రభుత్వానికి ఏమి సంబంధం అని ప్రశ్నించారు.  ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు అదే ప్రభుత్వం మా డబ్బు వసూలు చేసి ఎలా పెట్టుబడి పెడుతున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు నిర్భయంగా ఎలా పని చేయగలుగుతారు? 
ఐదేళ్ల క్రితం ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఉద్యోగి ఎవరైనా మరణిస్తే దహనసంస్కారాలకు ఇచ్చేసొమ్ము తప్ప ఏమీ అందేది కాదు.  ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడి, రాష్ర్ట ప్రభుత్వాన్ని ఒప్పించి మరణించిన వారికి గ్రాట్యుటీ,  కుటుంబపింఛను జీవోలు తెప్పించాం.  ప్రస్తుత కరోనా సమయంలో దురదృష్టవశాత్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడకుండా ఉన్నాయంటే అందుకు మేము సాధించిన గ్రాట్యుటీ, కుటుంబ పింఛనులే కారణం. ఆ జీవోలను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి డీఎన్ఏ పరీక్ష చేయిస్తే ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం అనే పేరొస్తుంది అని గర్వంగా చెబుతుంటాం. 
ఉద్యోగులు.న్యూస్:   సీపీఎస్ విషయంలో సీఎంను కలిశారా? ఆయన ఏమంటున్నారు?
రామాంజనేయులు:  గత ఎన్నికల్లో 60‌ నుంచి 70 ఎమ్మెల్యే స్థానాల్లో సీపీఎస్ ఉద్యోగులం ప్రభావితం చేశాం.  అయినా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాకు దొరకడం లేదు. సీపీఎస్ రద్దు గురించి అడుగుతామనో మరోటో తెలియదు కాదు ఆయన సమయం మాకు ఇవ్వడం లేదు.  మాకే కాదు..ఏ ఇతర సంఘానికీ సమయం ఇవ్వడం లేదు.  గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిని కలిసినా ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ద్వారానే కలవగలిగాం కానీ వ్యక్తిగతంగా మాకు ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదు. ఎన్నికల్లో సీపీఎస్ ఉద్యోగుల వల్ల 50 నుంచి 60 స్థానాల్లో గెలుచుకోగలిగాం అని గుర్తించయితే మమ్మల్ని పిలవలేదు.  
ఉద్యోగులు.న్యూస్- సెప్టెంబరు 1 తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది?
రామాంజనేయులు : ప్రభుత్వం స్పందనను బట్టి నిర్ణయించుకుంటాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఒప్పించి సాధించుకోవాలన్నదే మా ఆలోచన.  ఉద్యమం నిరంతర ప్రక్రియ. దశలవారీగా నిర్వహిస్తాం. ఎప్పటికప్పడు పరిస్థితులను బట్టి ఉద్యమ స్వరూపాన్ని మార్చుకుంటాం.  ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఉద్ధృతి పెంచుకుంటూ వెళ్తాం. 
ఉద్యోగులు.న్యూస్:  రాష్ర్టంలో సీపీఎస్ పరిధిలో ఎంత మంది ఉన్నారు?
రామాంజనేయులు:  నేషనల్ సెక్యూరిటీ డిపాజటరీ లిమిటెడ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 1,90,000 మంది సీపీఎస్ లో ఉన్నారు. అక్టోబరు 2 నుంచి మరో 1,30,000 మంది చేరబోతున్నారు.  ఇక ఆర్టీసీ సిబ్బంది త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వారు అటు పాత పింఛను పథకంలోనూ లేరు,ఇటు సీపీఎస్ లోనూ ఉన్నారు. ఆర్టీసీ సిబ్బందిలాగానే ఏ పింఛను పథకంలోనూ లేని విభాగాలు రాష్ర్టంలో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలా సీపీఎస్ అమలులోనూ లోపాలున్నాయి. 
ఉద్యోగులు.న్యూస్:  ఆర్టీసీ సిబ్బందిని మీ ఉద్యమంలో కలుపుకుని వెళ్తున్నారా?
రామాంజనేయులు: ఆర్టీసీ నాయకత్వం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తోంది. వారు మా మధ్దతు కోరితే వారికి అవగాహన కల్పించడానికి, ఉద్యమ స్రవంతిలో ముందుకు తీసుకెళ్లడానికి మేము సిద్ధమే.
(ఇంటర్వ్యూ మొదటి భాగం కోసం    క్లిక్ చేయండి)

https://www.udhyogulu.news/article/employees/eyJhcnRpY2xlaWQiOiIxMjEwMDM2MTcifQ