అర్చక సమస్యలపై చొరవ అవసరం
 

•    వంశపారంపర్య హక్కులను అమలు చేయాలి
•    స్వరూపానందేంద్ర స్వామి
•     స్వామీజీని కలిసిన దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆగస్టు 22: ఆలయాల్లో అర్చకులకు కల్పించిన వంశపారంపర్య హక్కులను వెంటనే అమలు చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ప్రభుత్వానికి సూచించారు. అర్చకుల డిమాండ్లపైనా చొరవ చూపాలన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్… రిషికేష్ వెళ్ళి చాతుర్మాస్య దీక్ష చేపట్టిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములను కలిశారు. పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. స్వాత్మానందేంద్ర స్వామి చేతులమీదుగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరులకు నిర్వహించిన పీఠపూజలో పాల్గొన్నారు. అనంతరం ఇటీవల దేవాదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన మార్పులను స్వామి స్వరూపానందేంద్రకు వివరించారు. ఈ సందర్బంగా అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్ కు స్వామీజీ సూచించారు. కోవిడ్ నేపధ్యంలో ఆన్‌లైన్ ద్వారా పూజలు, వ్రతాలు చేపట్టడం ద్వారా మంచి స్పందన వచ్చిందని, దేవాదాయశాఖకు ఆదాయం పెరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ స్వామీజీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ చర్యలను స్వామీజీ ప్రశంసించారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవాలని స్వామీజీ సూచించారు.