మచిలీపట్నంలో పీఆర్టీయూ ప్రాంతీయ కార్యాలయం 
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆగస్టు 31: పీఆర్టీయూ ప్రాంతీయ కార్యాలయాన్ని మచిలీపట్నంలో ప్రారంభించారు. పట్టణంలోని  పరాస్ పేట  సెంటర్లో  ఏర్పాటు చేసిన ఏపీ పీఆర్టీయూ (reg no.102/18)  ప్రాంతీయ కార్యాలయాన్ని ఆ సంఘం స్టేట్ అకడమిక్ సెల్  రాష్ట్ర కన్వీనర్ కోసూరి రాజశేఖర్,  రాష్ట్ర కార్యదర్శి వక్కలగడ్డ శ్రీనివాస్,  కృష్ణా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  గంటా రంగా రావు, కొనకళ్ల రమేశ్ బాబు సమక్షంలో ప్రారంభించినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది బోయిన శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.  ఇక్కడి నుంచి ఉపాధ్యాయులకు అన్ని రకాల  సేవలు అందించనున్నట్లు  తెలియజేశారు.  ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  ముఖ్యఅతిథి కోసూరి రాజశేఖర్ మాట్లాడుతూ  మచిలీపట్నంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం  సంతోషించదగ్గ విషయమన్నారు.  డీఈవో కార్యాలయానికి దగ్గరలో ఉండటం  ఉపాధ్యాయులందరికీ ఉపకరిస్తుందని,  ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి  ఈ ప్రాంతీయ కార్యాలయం బాధ్యులు పెద్ది బోయిన శ్రీనివాసరావు కృషి చేయాలని కోరారు.  ఈ సందర్భంగా గంటా రంగారావు మాట్లాడుతూ  ఈ కార్యాలయంలో  త్వరలో సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసి  ఆన్లైన్  కు సంబంధించిన  విషయాల్లో ఉపాధ్యాయులకు  సహాయకారిగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.  ప్రధాన కార్యదర్శి కొనకళ్ల రమేష్ బాబు మాట్లాడుతూ  ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ ప్రాంతీయ కార్యాలయం నిర్వహణకు పూనుకున్న  పెద్ది బోయిన శ్రీనివాసరావు కు అభినందనలు తెలిపారు.  రాష్ట్ర కార్యదర్శి  వక్కలగడ్డ శ్రీనివాస్  ఈ కార్యాలయం నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.  ఇంకా ఈ కార్యక్రమంలో  వివిధ మండలాల ప్రతినిధులు  మహమ్మద్ పాషా,  ఈశ్వరరావు, గొరిపర్తి శ్రీనివాసరావు,  మానేపల్లి శ్రీనివాసరావు,  రవి ప్రసాద్,  కుప్పల శ్రీనివాసరావు  తదితరులు  పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని  పలువురు తెలుగు ఉపాధ్యాయులను  ప్రాంతీయ కార్యాలయం నిర్వాహకులు,  అతిథుల సమక్షంలో ఘనంగా   సన్మానించారు.