గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ జీ వో సంఘం బాసట
 

- పరీక్షలు లేకుండానే ప్రొబెషనరీ ఖరారు చేయాలి
- ఎన్ జీ వో నేత బండి శ్రీనివాసరావు డిమాండ్
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 8- గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలతో  సంబంధం లేకుండా అక్టోబర్2న  ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి అని ఎ.పి.యన్.జి.ఒ  అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.  దాదాపు 1.34 లక్షలమంది ఉద్యోగులను జిల్లా ఎంపిక కమిటీల ద్వారా  పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారన్నారు. వీరికి రెండు సంవత్సరాలు ప్రొబెషనరీ కాలంగా నిర్ణయించి రూ.15 వేల వేతనం చెల్లిస్తున్నారని అన్నారు. రెండేళ్ల తర్వాత వీరికి ప్రొబెషనరీ ఖరారు చేయాల్సి ఉందన్నారు. అయితే డిపార్టుమెంట్ పరీక్షలు పాసైతేనే ప్రొబెషనరీ అని ఇప్పుడు పేర్కొంటున్నారని బండి శ్రీనివాసరావు అన్నారు. కరోనా వల్ల డిపార్టుమెంట్ పరీక్షలు రెండుసార్లే జరగడంతో వీరు ఇబ్బందులు పడ్డారన్నారు. మరికొన్ని పోస్టులకు డిపార్టుమెంట్ పరీక్షలు లేకపోవడంతో అసలు వారు హాజరు కాలేదన్నారు. ఇప్పుడు వీరికి ఎలాంటి డిపార్టుమెంట్  పరీక్షలు లేకుండానే ప్రొబెషనరీ ఖరారు చేయాలని శ్రీనివాసరావు విన్నవించారు. 11 విభాగాలకు చెందిన వారికి కొత్తగా సర్వీసు రూల్సు తయారు చేసి ఇప్పుడు డిపార్టుమెంట్ పరీక్ష పాస్ కావాలనడం తగదన్నారు.