గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగస్వాములు కావడం అదృష్టం 

 

• గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని 

సెప్టెంబరు 12:  గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా చెప్పారు.  విజయవాడలోని ఎ.పి.యన్.జి.ఒ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇనుమడింపజేయడంలో సచివాలయ ఉద్యోగుల కృషి వెలకట్టలేనిదని స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడిన వ్యవస్థలో ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి కోసం సంఘం అవసరమని గుర్తించి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల  పరిష్కారం కోసం నిరంతరం ఫెడరేషన్ తరపున కృషి చేస్తున్నామని, ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇటీవల సి.బి.ఎ.యస్ టెస్ట్ రద్దు కోసం తీవ్రంగా కృషి చేసి సచివాలయ ఉద్యోగులు ఆశించిన  ఫలితం పొందడం సంతోషకరమైన  విషయమని తెలిపారు.

ఎ.పి.యస్.యఫ్.యల్ చైర్మన్, ఫెడరేషన్ గౌరవ సలహాదారులు డా.పి.గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో ముఖ్యమంత్రి ప్రజల చెంతకు పాలన అందిస్తూ అవినీతి రహిత సమాజానికి బాటలు వేశారని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు కష్టించి పనిచేసి వ్యవస్థకు మంచి పేరు తీసుకొని రావాలని సూచించారు. 

ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.విద్యాసాగర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను  ఎటువంటి పరీక్షలతో సంబంధం లేకుండా నేరుగా ప్రకటించాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. వీటిలో ముఖ్యమైనవి..

• మరణించిన ఉద్యోగుల కుటుంబాల నుంచి కారుణ్యనియామకాలు చేపట్టేలా కృషి చేయాలి. 

• జూనియర్ ఆసిసిస్టెంట్ పే-స్కేల్ కోసం కృషి చేయాలి. ఇందుకు అధికారులకు వినతులు అందించాలి.  

• గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి అక్టోబర్2వ తేదీనాటికి  రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్బంగా ప్రతి సచివాలయం పరిధిలో సలాం సీఎం సార్ కార్యక్రమం నిర్వహించాలి.  ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉద్యోగి మొక్కలు నాటాలి. సేవా కార్యక్రమాలు(పేదలు,అనాథలకు) అన్నదానం నిర్వహించాలి. అలాగే ఆసుపత్రులు మరియు వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించాలి

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆసిసిస్టెంట్ వింగ్ రాష్ట్ర నాయకులు వినయ్,కోటి,ప్రసాద్,బహదూర్ బాషా,జి.నవీన్ కుమార్,చంద్రయ్య,శ్వేత తదితరులు పాల్గొన్నారు.