ఉపాధ్యాయులు,  ప్రధానోపాధ్యాయులకు  పదోన్నతులు

 

 

• బయోమెట్రిక్ కోసం కొత్త పరికరాలు, నాణ్యమైన సాఫ్ట్ వేర్

• యాప్ ల భారం తగ్గిస్తాం

• పార్ట్ టైమ్ ఇన్ స్ర్టక్టర్లకు ఆన్లైన్ బాధ్యతలు  

• మరో రెండు విడతలు సమావేశాలు నిర్వహించి మిగిలిన సమస్యల పరిష్కారం

• పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు హామీ

• ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘంతో  చర్చలు సఫలం

 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

సెప్టెంబరు 13: ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ నాయకులతో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్  ప్రతాప రెడ్డి ప్రధానోపాధ్యాయులు సమస్యలపై విద్యా శాఖ కమిషనర్ వారి కార్యాలయంలో సోమవారం చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు , కోశాధికారి రమణయ్య, 13 జిల్లాలకు చెందిన ప్రధానోపాధ్యాయ సంఘ బాధ్యులు పాల్గొన్నారు.  నాయకులు లేవనెత్తిన పలు సమస్యలపై కమిషనర్ సమాధానాలు చెప్పారు. 

ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు పోస్టుల భర్తీ విషయం చర్చకు రాగా వెంటనే  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేస్తామని కమిషనర్ తెలియజేశారు.

నూతనంగా అప్ గ్రేడ్ అయిన పాఠశాలలకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు విషయమై ఆర్థిక శాఖకు మరొకసారి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు నెలవారీ పదోన్నతులు కల్పించడానికి  ప్రధానోపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు తయారు చేసి వివాదరహితంగా పదోన్నతులు ఇస్తామని తెలియజేశారు.

జగనన్న గోరుముద్ద రేషన్ పంపిణీ కార్యక్రమం అమలుకు సంబంధించిన సమస్యలపై డైరెక్టర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.

ఉపాధ్యాయులు,  ప్రధానోపాధ్యాయులపై యాప్ ల భారం తగ్గిస్తామని ,  సర్వర్ సామర్థ్యం పెంచి  యాప్ ల వినియోగం సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. చైల్డ్ ఇన్ఫో కు సంబంధించి విద్యార్థి ప్రవేశ వివరాలను అప్లోడ్ చేయడానికి ఇచ్చిన సమయం పూర్తవగానే విద్యార్థుల వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని తెలియజేశారు. 

జగనన్న విద్యా కానుక పంపిణీ, బయోమెట్రిక్ మొదలైన అంశాలలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.  బయోమెట్రిక్ కోసం కొత్త పరికరాలు అందజేస్తామని, నాణ్యమైన సాఫ్ట్ వేర్ రూపొందించి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 

పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు శానిటరీ వర్కర్లకు ఆగస్టు నెల నుంచి 6 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని, అంతకుమునుపు నవంబర్ 2020 నుంచి 5000  రూపాయల చొప్పున ఫిబ్రవరి 2021 నుంచి  6000 రూపాయల చొప్పున చెల్లించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపిస్తామని తెలియజేశారు.

పాఠశాలలో అత్యధికంగా ఉన్న విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి ప్రస్తుతం అన్ని పాఠశాలలో కేటగిరి 7 లో అంటే మార్షల్ కేటగిరి లో ఉన్న విద్యుత్ కనెక్షన్లను కేటగిరి 2 అంటే డొమెస్టిక్ గా మార్చడానికి , పాఠశాల ఆవరణలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను తొలగించడానికి విద్యుత్ శాఖకు  ఆదేశాలు ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు.

2021-22 విద్యాసంవత్సరంలో స్థానిక సెలవులు, ఆప్షనల్ సెలవులను ప్రధానోపాధ్యాయులు స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవచ్చని , ఈ సెలవుల వివరాలను ఏ పీ టి ఈ ఎల్ ఎస్ యాప్ లో నమోదు చేయడానికి ప్రధానోపాధ్యాయుడి లాగిన్లో అవకాశం కల్పిస్తామని తెలియజేశారు.

9, 10 తరగతుల విద్యార్థులకు స్పెషల్ ఫీజు వసూలును రద్దు చేస్తూ  ఉత్తర్వులు ఇస్తామన్నారు.

పాఠశాల అకడమిక్ క్యాలెండర్, ఇతర ముఖ్యమైన విషయాలను రూపొందించడంలో ప్రధానోపాధ్యాయుల సంఘం సూచనను స్వీకరిస్తామని హామీ ఇచ్చారు. 

తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు సంబంధించి కోవిడ్ నిబంధనల ప్రకారం రోజుకు ఒక తరగతి చొప్పున ఎన్నిక నిర్వహించుకునే విధంగా  మూడు రోజుల సమయం ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలియజేశారు.

నాడు నేడు లో అభివృద్ధి చేసిన పాఠశాలలకు కరెంట్ బిల్లు, ఇతర  నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతి ఉన్నత పాఠశాల కు కనీసం ఐదు లక్షల రూపాయలు కంటింజెన్సీ నిధులను మంజూరు చేస్తామని తెలియజేశారు.

తొలి విడత నాడు-నేడు పనులలో ఎదురైన అనుభవాల దృష్ట్యా రెండో విడత నాడు-నేడు పనుల నిర్వహణలో తీసుకు రావాల్సిన మార్పుల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు తమ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుల పర్యవేక్షణ బాధ్యత, ఇతర విషయాలు అప్పగిస్తూ పాఠశాల నిర్వహణ అజమాయిషీని వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు.

పాఠశాలల నిర్వహణ కోసం ఇచ్చే నిధులను గత సంవత్సరం పీడీ ఖాతాల ద్వారా విడుదల అయినప్పటికీ ఇంతవరకు జమ కాని నిధులు అన్నిటినీ వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు.

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో డైట్ సీనియర్ లెక్చరర్ గా ప్రధానోపాధ్యాయులను ఫారిన్ సర్వీస్ పై వెంటనే నియమింప చేసేటట్లుగా ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు ఇస్తామన్నారు. గుంటూరు జిల్లాలో వాయిదా పడిన ప్రధానోపాధ్యాయుల బదిలీలను వెంటనే నిర్వహించడానికి వీలుగా ఆ జిల్లా ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 

డీసీఈబీ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయరాదని ఉత్తర్వులు ఇస్తామన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని హేతుబద్ధీకరించడానికి పంచాయతీరాజ్ కమిషనర్ తో సంప్రదించి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు.

పాఠశాలల్లో వివిధ కార్యక్రమాల ఆన్లైన్ విషయాలు చూడడానికి  ఇప్పటి కే ప్రతి పాఠశాలలో ఉన్న పార్ట్ టైమ్ ఇన్సట్రక్టర్కు  ఆ బాధ్యతను అప్పగిస్తామని చెప్పారు. 

500 మంది విద్యార్థులు దాటిన ప్రతి పాఠశాలనూ, ప్రతి మండలంలోనూ  2 ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలు గా ఉన్నతీకరించి,  ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా,  ప్రధానోపాధ్యాయులకు  ప్రిన్సిపాల్ గా పదోన్నతులు ఇస్తామని చెప్పారు.

250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి మాత్రమే 3,  4, 5 తరగతులు ఉన్నత పాఠశాల లో విలీనం చేస్తామని,  వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక కిలో మీటర్ల పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాల కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు. 3, 4, 5 తరగతులకు కూడా స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్ట్ వారి బోధన చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

స్కూల్ కాంప్లెక్స్ ను బలోపేతం చేస్తామని చెబుతూ వీటిని మరింత అభివృద్ధి చేయడానికి ప్రధానోపాధ్యాయుల సంఘం సలహాలు సూచనలు కోరారు.

త్వరలోనే ప్రధానోపాధ్యాయుల సంఘంతో మరో రెండు దఫాలు చర్చలు జరిపి మధ్యాహ్న భోజన పథకం,  స్కూల్ శానిటేషన్,  నాడు నేడు మొదలైన అంశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.