పీఎఫ్ ఖాతాలను తక్షణమే కొత్త జిల్లాలకు బదిలీ చేయాలి

•      టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జడ్పీ కార్యాలయం వద్ద నిరసన
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 13: జడ్పీ జీపీఎఫ్ ఖాతాలను తక్షణమే కొత్త జిల్లాలకు బదిలీ చేయాలని, ఖాతాలను అప్డేట్ చేయాలని, లోన్ ల మంజూరులో జాప్యం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జడ్పీ కార్యాలయం ముందు టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.  ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైద్య శాంతి కుమారి, గుర్రాల రాజవేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పూర్వపు 10 జిల్లాలను 2016 అక్టోబర్ 11 న 31 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించిందని, 2019 జనవరిలో మరొక రెండు జిల్లాలు ఏర్పాటయ్యయాని గుర్తు చేశారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేశారన్నారు.  నూతన జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభించి ఉద్యోగుల వర్గీకరణ కూడా పూర్తైందని,  ఉద్యోగుల వేతనాలు నూతన జిల్లాల ట్రెజరీల ద్వారానే చెల్లిస్తున్నారని  అయినప్పటికీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు మాత్రం ఇంకా పాత 9 జిల్లా ప్రజాపరిషత్ ల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారని తప్పుబట్టారు. పీఎఫ్ నుంచి లోన్లు, పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ అవసరమైన ఉద్యోగులు పూర్వపు జిల్లాప్రజాపరిషత్ సీఈవోకు దరఖాస్తు చేయాల్సి వస్తున్నదని చెప్పారు. పీఎఫ్ మినహాయింపుల షెడ్యూల్స్ పూర్వపు జిల్లా ప్రజాపరిషత్ లకు సక్రమంగా చేరకపోవటం, చేరినా ఉద్యోగుల ఖాతాల్లో నమోదు చేయకపోవటం వలన ఖాతాల్లో జమలు తక్కువగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం  చేశారు. పీఎఫ్ మంజూరులో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు.  పీఎఫ్ ఖాతాలను తాజాపర్చి , ఉద్యోగులు పనిచేస్తున్న జిల్లాల వారీగా ఆయా జిల్లాప్రజాపరిషత్ లకు తక్షణమే బదిలీ చేయాలని వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ కమిషనర్కు వినతులు సమర్పించి, చర్చించిన ఫలితంగా పీఎఫ్  ఖాతాలను తాజాపరచి కొత్త జిల్లాప్రజాపరిషత్ లకు బదిలీ చేయాలని స్పష్టంగా ఆదేశించారని తెలిపారు. కానీ ......నెలలు గడిచినా ఆ ఉత్తర్వులు అమలు జరగలేదన్నారు. తక్షణమే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను అప్ డేట్ చేసి వారు పనిచేస్తున్న జిల్లాల జిల్లాప్రజాపరిషత్ కార్యాలయాలకు బదిలీ చేయాలని  డిమాండ్ చేశారు. 
ఆదిలాబాద్  పూర్వపు జిల్లాప్రజాపరిషత్ కార్యాలయంలో ఉన్న ఈ జిల్లా ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలను ఆప్ డేట్ చేయించి, ఈ జిల్లాప్రజాపరిషత్ కు బదిలీ చేయించటానికి మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్ ప్రధాన కార్యనిర్వహణాధికారి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని శాంతి కుమారి , రాజవేణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి నర్సయ్య, చక్రపాణి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆగచారి,  శ్రీనివాస రావు, జయప్రద,  ప్రదీప్, సంపత్ , శివానంద్ తదితరులు పాల్గొన్నారు.