జడ్పీ జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు బదిలీ చేయాలి
 

•      రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ కార్యాలయాల ఎదుట టీఎస్ యూటీఎఫ్ ఆందోళన 
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 13:  జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను తక్షణమే కొత్త జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ  సోమవారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లాప్రజాపరిషత్ కార్యాలయాల ఎదుట ప్రదర్శన  నిర్వహించి ప్రధాన కార్యనిర్వహణాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సీఈఓలను నియమించారు. సిబ్బందిని విడగొట్టారు. జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలు నిర్వహించి, పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు ఎన్నికయ్యారు.  కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల వర్గీకరణ కూడా పూర్తైంది. ఉద్యోగుల వేతనాలు నూతన జిల్లాల ట్రెజరీల ద్వారానే చెల్లిస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు మాత్రం ఇంకా పాత 9 జిల్లా ప్రజాపరిషత్ ల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. పీఎఫ్ నుంచి  లోన్లు, పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ అవసరమైన ఉద్యోగులు కొత్త జిల్లాలో పనిచేస్తూ, పూర్వపు జిల్లాప్రజాపరిషత్ సీఈఓల కు దరఖాస్తు చేయాల్సి వస్తున్నది. పీఎఫ్ మంజూరులో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల పీఎప్ ఖాతాలను తాజాపర్చి , ఉద్యోగులు పనిచేస్తున్న కొత్త జిల్లాల వారీగా ఆయా జిల్లాప్రజాపరిషత్ లకు తక్షణమే బదిలీ చేయాలని వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ కమిషనర్కు వినతులు సమర్పించి, చర్చించిన ఫలితంగా పీఎఫ్  ఖాతాలను తాజాపరచి కొత్త జిల్లాప్రజాపరిషత్ లకు బదిలీ చేయాలని స్పష్టంగా ఆదేశించారు.  కానీ 17 నెలలు గడిచినా ఆ ఉత్తర్వులు అమలు జరగలేదు. ఇంకా ఖాతాలు అప్డేట్ చేయలేదు. నూతన జిల్లాలకు బదిలీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. తమ ఖాతాల నిర్వహణ పట్ల ఉద్యోగులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను అప్ డేట్ చేసి వారు పనిచేస్తున్న  జిల్లాప్రజాపరిషత్ కార్యాలయాలకు బదిలీ చేయాలని  కోరుతూ, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అన్ని జిల్లాల్లో జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాల ఎదుట ప్రదర్శనలు నిర్వహించి సీఈఓలకు వినతిపత్రాలు అందజేసినట్లు టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి  తెలిపారు.

ఎక్కువ మందిచదివినవి